ఒంగోలులో శ్రీలీల షాపింగ్

బెంగళూరులో ఉండేవాళ్లు షాపింగ్ కోసం ఒంగోలు వస్తారా? వినడానికే విడ్డూరంగా ఉంది కదా. అయితే శ్రీలీల మాత్రం ఇదే పని చేసింది. చిన్నప్పుడు బెంగళూరులో చదువుకున్న ఈ బ్యూటీ, షాపింగ్ కోసం ఒంగోలుకు వచ్చేదంట.
ఏటా వేసవి శెలవుల కోసం ఒంగోలులోని తాత నాగేశ్వరావు నిడమానూరు ఇంటికి వచ్చేది శ్రీలీల. ఆ టైమ్ లో తప్పకుండా ఇంటిల్లిపాదీ షాపింగ్ చేసేవారంట. బెంగళూరు నుంచి వచ్చి ఒంగోలులో షాపింగ్ చేయడం చూసి ఒక్కోసారి షాపు యజమానులు కూడా ఆశ్చర్యపోయేవారంట.
అయితే పైకి చూడ్డానికి షాపింగ్ లా అనిపించినప్పటికీ, అది తనకు మరుపురాని అనుభూతి అంటోంది శ్రీలీల.
తాత, బామ్మతో కలిసి షాపింగ్ చేసిన ఆనాటి ఆనవాళ్లు ఇప్పటికీ తన మదిలో పదిలంగా ఉన్నాయని చెబుతోంది.
తనకు ఏదైనా కష్టం వస్తే, అమ్మ తర్వాత షేర్ చేసుకునే వ్యక్తి తాత మాత్రమే అంటోంది శ్రీలీల. గ్రాండ్ పేరెంట్స్ ను తరచుగా కలుస్తూ ఉండాలని, అప్పుడే జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుస్తాయని అంటోంది.