ఇక డైలాగులూ రాస్తాను: శ్రీమణి

‘100 పర్సెంట్ లవ్’ చిత్రంతో తో గీతరచయితగా పరిచయమైన శ్రీమణి. తెలుగు సినీ పరిశ్రమలో పాటల రచయితగా తనకంటూ ఓ గుర్తింపు సంపాందించుకున్నారు. ఎన్నో అగ్రశ్రేణి చిత్రాలకు, స్టార్‌హీరో చిత్రాలకు గేయ రచయితగా పనిచేశారు శ్రీమణి. ఇప్పుడు డైలాగ్ రైటర్ గా మారాలనుకుంటున్నారు. స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా నిరూపించుకోవాలనేది ఆయన ధ్యేయం. కేవలం పాటల రచయితగానే ఉండిపోకుండా పరిపూర్ణ రచయితగా ఎదగాలని అనుకుంటున్నారు.
“ఇటీవల తండేల్‌లో బుజ్జితల్లి, హైలెస్సా పాటలతో పాటు లక్కీ భాస్కర్‌లోని నిజమా కలా, ఆయ్ సినిమాలోని పాటలు నాకు పేరును తెచ్చిపెట్టాయి. ఈ పాటలన్నీ కథలో ఉన్న సన్నవేశం తాలూకా లోతైన భావం చెప్పడమే. ఇలాంటి పాటలు రాసే అవకాశం రావడం గర్వంగా ఉంది,” అని అన్నారు శ్రీమణి.
“మనం రాసిన పాట గురించి మనం గౌరవించే వ్యక్తులు, ఆరాధించే వ్యక్తులు గొప్పగా చెప్పినప్పుడు బాగా సంతృప్తి దొరుకుతుంది. నన్ను గేయ రచయితగా పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ గారు ‘గీతా గోవిందం’ సినిమాలో వచ్చిందమ్మా పాట గురించి బాగా మెచ్చుకున్నారు. బాగా రాస్తున్నావు అని ఎంకరేజ్ చేశారు. నన్ను ఇండస్గ్రీకి పరిచయం చేసిన వ్యక్తి నన్ను అభినందించడం నాకు గొప్పగా అనిపించింది. మహర్షి పాట విని సిరివెన్నెల సీతరామశాస్త్రి లాంటి గొప్ప వ్యక్తి అభినందించడం నా జీవితంలో మరిచిపోలేను. ఇలాంటి సమయాల్లో గొప్ప పాటను రాశాననే భావన కలుగుతుంది,” అని తనకి సంతృప్తినిచ్చిన పాటల గురించి చెప్పారు.
“రచన అంటే నాకు ప్రాణం. సాహిత్యం విలువ పెంచాలి అనేది నా కోరిక.”