గ్రాఫిక్స్ మరో పెద్ద మాఫియా

టాలీవుడ్ లో మాఫియా అనే పదాన్ని కొన్ని సెగ్మెంట్లలో వాడుతారు. డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సర్కిల్ లో మాఫియా నడుస్తుందని కొంతమంది ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మాఫియా అనే పదాన్ని గ్రాఫిక్స్ డిపార్ట్ మెంట్ కు కూడా ఆపాదించారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్.
సినిమా గ్రాఫిక్స్ కు సంబంధించి చాలా పెద్ద మాఫియా నడుస్తోందని ఆరోపించారు విశ్వప్రసాద్. సరిగ్గా విడుదల తేదీకి కొన్ని రోజుల ముందు మాత్రమే గ్రాఫిక్స్ చేతిలో పెడతారని, రెండోసారి కరెక్షన్లు అడిగే అవకాశం లేకుండా చేస్తారనేది విశ్వప్రసాద్ వాదన.
‘బ్రో’ సినిమాకు ఆఖరి నిమిషంలో గ్రాఫిక్స్ ఇస్తే, తిరిగి తన సొంత కంపెనీల్లో వాటికి ఫైనల్ టచప్స్ ఇచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. వాళ్లకు డబ్బులిచ్చి, సొంత సిబ్బందితో గ్రాఫిక్స్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
‘మిరాయి’ సినిమా గ్రాఫిక్స్ ను ఎవ్వరికీ ఇవ్వలేదని, పూర్తిగా తన కంపెనీలే చేస్తున్నాయని విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ‘రాజాసాబ్’ గ్రాఫిక్స్ మాత్రం 60 శాతం బయట కంపెనీలు చేశాయని, మిగతా 40 శాతం తమ కంపెనీలు పూర్తిచేశాయని తెలిపారు.