‘ఓజీ’కి ఎందుకింత క్రేజ్?

పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ” సినిమా విషయంలో ఉన్న హైప్, క్రేజ్ మాములుగా లేదు. రాజమౌళి సినిమాలకు స్థాయిలో ఉంది. ఈ సినిమా విడుదలకు ఇంకా 20 రోజుల టైం ఉంది. కానీ అప్పుడే అమెరికాలో ప్రీమియర్ షో కోసం టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ అడ్వాన్స్ టికెట్ అమ్మకాలు ఇప్పటికే మిలియన్ డాలర్లు (8.5 కోట్లు రూపాయలు) దాటాయి.
20 రోజుల ముందే 1 మిలియన్ డాలర్ల మైలురాయి అందుకున్న మొదటి భారతీయ చిత్రం… ఓజి. దీన్నిబట్టి చెప్పొచ్చు ఏ రేంజులో దీనికి క్రేజుందో.
ఐతే, ఈ సినిమాకే ఎందుకింత క్రేజ్ అనేది ఒక పెద్ద మిస్టరీనే. ఎందుకంటే దర్శకుడు సుజీత్ కి ఇంతకుముందు హిట్ లేదు. ప్రభాస్ తో తీసిన “సలార్” బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. పైగా ఈ సినిమా గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది. హీరోయిన్ కూడా యమా క్రేజున్న భామ కాదు. కానీ హైప్ మాత్రం బాహుబలి రేంజ్ కి వచ్చింది.
ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన “హరి హర వీర మల్లు” చిత్రం దారుణంగా పరాజయం పాలు అయింది. పవన్ కళ్యాణ్ అభిమానులు, సాధారణ ప్రేక్షకులు కావాలనే ఆ సినిమాని పట్టించుకోలేదు అని అంటున్నారు. అది ఘోరంగా ఉంటుంది అని వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యారట. అందుకే ఆ డబ్బులను ఈ సినిమాకి పెడుతున్నారు అని విశ్లేషకులు చెప్తున్నారు.
పవన్ కళ్యాణ్ కూడా అనేక సభల్లో “ఓజీ చూద్దురు గానీ బాగుంటది” అని అభిమానులకు చెప్పారు. పైగా దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. అందుకే ఇప్పటివరకు వచ్చిన టీజర్, పాటలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చాయి.