
షూటింగ్స్ చేసే టైమ్ లో గాయాలు తగలడం సహజం. అందుకే హీరోలు మరీ రిస్కీ షాట్స్ చేయరు. ఏమైనా గాయలు తగిలితే మొత్తానికే షూటింగ్ ఆగిపోతుంది. కోట్ల రూపాయల నష్టం వస్తుంది. అయినప్పటికీ రామ్ చరణ్ (Ram Charan) లాంటి హీరోలు చిన్న చిన్న రిస్కులు చేస్తుంటారు. ‘పెద్ది’కి కూడా అలానే రిస్క్ చేశాడు.
“ప్రతి సినిమాకు నాకు దెబ్బలు తగులుతాయి. ‘మగధీర’ నుంచి ‘గేమ్ ఛేంజర్’ వరకు అన్ని సినిమాలకూ దెబ్బలు తగిలాయి. ‘పెద్ది’ టైమ్ లో కూడా 2-3 దెబ్బలు తగిలాయి. అయితే ఇష్టమైన పని చేస్తున్నప్పుడు నొప్పి తెలియదు. అలా గ్యాప్ లేకుండా పనిచేశాను. ఎప్పుడైతే షూటింగ్ పూర్తయిందో అప్పుడు దెబ్బలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.”
పహిల్వాన్ గెటప్ తో చేసిన షూటింగ్ లోనే చరణ్ కు ఎక్కువగా దెబ్బలు తగిలాయి. కంటిపైన గాయమైంది. షూటింగ్ పూర్తయిన తర్వాత చేతి గాయం కూడా బయటపడింది. ఇది ఎంత పెద్ద గాయమో తాజాగా వెల్లడించాడు.
“ఈ చేయిని తిప్పలేకపోతున్నా. లోపల బాగా నొప్పిగా ఉంది. ఎంతలా అంటే నా పాపను కూడా ఎత్తుకోలేకపోతున్నాను. ప్రస్తుతం మెడికల్ ప్రొసీజర్ నడుస్తోంది. మరికొన్ని రోజుల్లో సెట్ అయిపోతుంది. అందరికంటే నాకు ఎక్కువ గిఫ్టులు (గాయాలు) బుచ్చిబాబే ఇచ్చాడు.”
ఇలా తన గాయాలపై స్పందించాడు రామ్ చరణ్.
