
మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయడం ఇతడికి ఇష్టం. అయితే అలా ఫైట్స్ చేస్తూ, తీవ్రంగా గాయపడిన సందర్భాన్ని పంచుకున్నాడు ఈ నటుడు.
2023లో జరిగిన ఒక సినిమా షూటింగ్ ప్రమాదంలో తనకు తీవ్ర గాయమైందని, ఆ ప్రమాదం కారణంగా ప్రస్తుతం తన ఎడమ కాలిలో 3 టైటానియం స్క్రూలు ఉన్నాయని వెల్లడించి అందరినీ షాక్కు గురిచేశారు.
ఈ ఒక్క దెబ్బతో పృధ్వీరాజ్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. రిస్కీ పైట్లు చేయడం కంటే, బాధ్యతగా ఉండడం ముఖ్యమని తెలుసుకున్నాడట ఈ హీరో.
ఒక చిన్న పొరపాటు లేదా అనుకోకుండా జరిగే ప్రమాదం మనల్ని మాత్రమే కాకుండా… ఒక సినిమా నిర్మాణాన్ని, దాన్ని నమ్ముకున్న వందలాది కార్మికుల్ని ప్రభావితం చేస్తుందంటున్నాడు. అప్పట్లో తనకు జరిగిన ప్రమాదం వల్ల, సినిమా ఆలస్యమై, వందల కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని, అప్పట్నుంచి స్టంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నట్టు వెల్లడించాడు.
తన తాజా చిత్రం ‘ఐ, నోబడీ’ (I, Nobody) షూటింగ్ సమయంలో జరిగిన మరొక భయానక ప్రమాదాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు. ఒక యాక్షన్ సీన్ తీస్తున్నప్పుడు ఫైటర్ తలకు తీవ్ర గాయమైందని, మెడ వెనుక భాగంలో ఏకంగా 37 కుట్లు పడ్డాయని తెలిపాడు. ఒకవేళ ఆ షాట్ తాను స్వయంగా చేసి ఉంటే, మరో 6 నెలల పాటు సినిమా ఆగిపోయేదని వెల్లడించాడు.
ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగులో రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం “వారణాసి”(Varanasi)లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రామాయణ కాలం నేపథ్యంగా మహేష్ బాబు, పృథ్వీరాజ్ మధ్య సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి అని అంటున్నారు.
