ఇంటర్వ్యూలు

సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం “సింగ్ గీతం” (Sing Geetham). ‘మహానటి’, ‘కల్కి 2898 AD’ చిత్రాల దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin)ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విశేషాలను నాగ్ అశ్విన్ మీడియాతో పంచుకున్నారు.

‘సింగ్ గీతం’ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? ఆయన చిత్రాలు ఈ తరం ప్రేక్షకులకు నచ్చుతాయా?

ఈ ప్రయాణం సింగీతం గారితోనే ప్రారంభమైంది. ఈ కథను ఆయన చాలా కాలంగా తెరకెక్కించాలని అనుకుంటున్నారు. కమల్ హాసన్ గారిని కలిసినప్పుడు ఆయన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. “పుష్పక విమానం” కంటే ముందే ఈ కథను కమల్ హాసన్ గారికి వినిపించారట. అయితే అప్పట్లో ఇతర ప్రాజెక్టుల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఆ ఆలోచన తెరపైకి వచ్చింది.

సింగీతం గారి సినిమాలు – “పుష్పక విమానం”, “ఆదిత్య 369”, “భైరవ ద్వీపం” – ఏవి చూసినా కాలాతీతంగా అనిపిస్తాయి. ఇప్పటికీ “పుష్పక విమానం” చూస్తే ఎంతో తాజాగా, రిలెవెంట్‌గా ఉంటుంది. బహుశా అది ఆయన మాయాబజార్ వంటి క్లాసిక్ చిత్రాల నుంచి నేర్చుకున్న మెలకువ కావచ్చు. “సింగ్ గీతం” కూడా ఈ తరం కోసం ప్రత్యేకంగా రూపొందించిన కథలా అనిపిస్తుంది.

కొత్తవాళ్లతో తీయడానికి కారణం ఏమిటి?

అది పూర్తిగా సింగీతం గారి నిర్ణయం. ఆయనకు కొత్త తరం నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేయడం అంటే ఎంతో ఇష్టం. కొత్తవాళ్లతో పనిచేయడంలో ఆయనకు ప్రత్యేకమైన ఉత్సాహం ఉంటుంది.

అంతేకాకుండా, ఇది ఒక ప్రత్యేకమైన ప్రపంచంలో జరిగే కథ. పెద్ద స్టార్‌లు ఉంటే వారి ఇమేజ్ ప్రభావం కథపై పడే అవకాశం ఉంటుంది. కొత్త ముఖాలు అయితే ప్రేక్షకులు ఆ ప్రపంచాన్ని మరింత సహజంగా అనుభూతి చెందగలరు. అయాన్, అహల్య ఇద్దరూ ఎంతో ప్రతిభావంతులైన నటులు. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అయాన్, శాలిని తెలుగువాళ్లే కాగా, అహల్య ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుంది. వీరికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాను.

ఇప్పటి యువతకు కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఇందులో డైలాగ్‌లు అన్నీ పాటల రూపంలో వస్తాయి. అయితే కొద్ది సేపటికే ప్రేక్షకులు ఆ విషయాన్ని మర్చిపోయి కథలో పూర్తిగా లీనమైపోతారు. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో సినిమా చూసినప్పుడు ప్రతి సన్నివేశం ఎంతో వినోదాత్మకంగా అనిపించింది. డైలాగ్‌లు పాటల్లా వస్తున్నాయనే భావన అసలు కలగదు.

‘జాతిరత్నాలు’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమాను నిర్మించారు కదా. మిమ్మల్ని ఎక్సైట్ చేసిన అంశం ఏమిటి?

సినిమా నిర్మించడం నా ప్రధాన పని కాదు. ఒక కథ నచ్చి, ఆ కథను ఇంకెవరూ అంత బాగా చేయలేరనిపించినప్పుడే నేను నిర్మాతగా ముందుకొస్తాను. “జాతిరత్నాలు” కూడా అలాంటి సినిమానే. ఆ సమయంలో అలాంటి కథను మరెవ్వరూ చేయరనిపించింది. “సింగ్ గీతం” విషయంలో కూడా అదే భావన కలిగింది.

ఇది చాలా ప్రత్యేకమైన సబ్జెక్ట్. సింగీతం గారి విజన్‌పై, ఆయనపై ఉన్న అభిమానంతోనే ఈ సినిమాను నిర్మించాను.

ఇది బంగారం నేపథ్యంలోని కథేనా?

“మహానటి” తర్వాత సింగీతం గారు నాకు ఈ కథ చెప్పారు. ఇది పూర్తిగా కల్పిత కథ. కుబేరపురం అనే ఊరిలో బంగారు గనులు ఉంటాయి. ఆ ఊరికి, ఆ గనులకు మధ్య ఉన్న అనుబంధం ఏమిటన్నది సింగీతం గారి ప్రత్యేక శైలిలో, ఆయన ట్రేడ్‌మార్క్ హాస్యంతో చెప్పడం జరిగింది.

ఆయన ఏ కథ రాసినా అందులో మానవత్వం, హాస్యం రెండూ తప్పనిసరిగా ఉంటాయి. ఈ సినిమాలో కూడా అదే టోన్ కనిపిస్తుంది.

సింగీతం గారి వర్కింగ్ స్టైల్ మీకు ఎలా అనిపించింది?

రచన, రిహార్సల్స్ ప్రక్రియ చాలా విస్తృతంగా సాగింది. దాదాపు తొమ్మిది నెలలు మేము కథ, స్క్రిప్ట్‌పై పనిచేశాం. నటీనటులు ఫైనల్ అయిన తర్వాత కూడా రిహార్సల్స్ నిర్వహించాం.

సింగీతం గారు చాలా స్పాంటేనియస్‌గా ఉంటారు. ఒకసారి ఏదైనా చెప్పి, తర్వాత అది తనకే నచ్చకపోతే వెంటనే మార్చేస్తారు. “మీరే ఇలా చెప్పారు కదా?” అని అడిగితే, “నేను తప్పు చేయకూడదా?” అని నవ్వుతూ సమాధానం చెబుతారు. అలాంటి ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను.

ఆయనతో కలిసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజానికి ఆయనను కలవడమే ఒక గొప్ప అనుభవం. అలాంటిది రెండేళ్ల పాటు ఆయనతో కలిసి ప్రయాణించడం, ప్రతిరోజూ మాట్లాడటం, ఒక సినిమా నిర్మించడం మాటల్లో చెప్పలేని ఆనందం.

ఈ ప్రాజెక్ట్‌లో ప్రతి అడుగులోనూ నేను భాగమయ్యాను. నిర్మాతగా మాత్రమే కాదు, ఆయన విజన్‌ను తెరపైకి తీసుకురావడానికి అసిస్టెంట్ డైరెక్టర్‌లా కూడా పనిచేశానని చెప్పొచ్చు. వారం రోజుల తర్వాత మర్చిపోయే సినిమా కాదు ఇది. పదేళ్ల తర్వాత కూడా గుర్తుండిపోయే చిత్రంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను చేశాం.

దేవిశ్రీ ప్రసాద్ గారికి కథ చెప్పినప్పుడు ఆయన స్పందన ఎలా ఉంది?

దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఒక లెజెండ్. సంగీత పరంగా ఇది చాలా సవాలుతో కూడుకున్న సినిమా. ఆయనకు కూడా ఇది పూర్తిగా కొత్త అనుభవం. ఈ చిత్రంలో దాదాపు నాన్‌స్టాప్ మ్యూజిక్ ఉంటుంది. కానీ ఎక్కడా “మనం సంగీతం వింటున్నాం” అనే ఫీలింగ్ రాదు. అంత సహజంగా, కథలో భాగంగా మ్యూజిక్‌ను మలిచారు. అదే ఈ సినిమా ప్రత్యేకత అని నేను భావిస్తున్నాను.

ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు విజయవంతం కావడానికి ఎలాంటి కసరత్తు చేస్తుంటారు?

ఏ సినిమా విజయవంతమవుతుందో, ఏది కాదో ముందుగా ఎవరూ చెప్పలేరు. కానీ ఒక కథను నిజాయితీగా చెప్పడం మాత్రం మన చేతిలో ఉంటుంది. ఆ నిజాయితీ ఉంటే విజయం దానంతట అదే వస్తుందని నేను నమ్ముతాను.

“పుష్పక విమానం” కథ చెప్పినప్పుడు కూడా చాలామంది “మాటలు లేకుండా సినిమా ఎలా ఉంటుంది?” అనుకుని ఉండొచ్చు. కానీ సింగీతం గారు దాన్ని అత్యంత నిజాయితీతో తీశారు కాబట్టే నేటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం.

నేను “మహానటి” తీస్తానన్నప్పుడు కూడా “ఇప్పటి ప్రేక్షకులు అలాంటి సినిమాను చూస్తారా?” అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. సినిమా పూర్తయ్యే వరకు దాని ఫలితం ఎవరూ అంచనా వేయలేరు. మనం నిజాయితీని నమ్మితే విజయం మన వెంట వస్తుంది.

‘కల్కి 2’ గురించి?

Kalki 2898 AD రెండో భాగం ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి నిరవధికంగా షూటింగ్ కొనసాగించి, శరవేగంగా పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నాం.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

Recent Posts

విజయ్ కలలాంటి విజయం చూశారు: Anil Ravipudi

హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…

37 minutes ago

Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ

ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…

6 hours ago

Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్

టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…

6 hours ago

Pooja Hegde: ఆమెకి కత్తెర వేశాను, దర్శకుడి వ్యాఖ్యలు వైరల్

తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…

7 hours ago

Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం

హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…

1 day ago

నాగవంశీకే డేట్ పాటించాలని చెప్పిన Akkineni Nagarjuna

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…

1 day ago