
అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ‘లెనిన్’ (Lenin) జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సినిమా విడుదల నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
“ఈ సినిమాను చాలా నిజాయితీగా చేశాం. మా కంటెంట్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. సినిమా విడుదలయ్యాక అదే మాట్లాడుతుంది. ‘లెనిన్’ నాకు ఎంతో ప్రత్యేకమైన సినిమా” అని అన్నారు అఖిల్.
నాగార్జున మాట్లాడుతూ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరుపై ప్రశంసలు కురిపించారు. “శ్రీరామపురం బ్యాక్‌డ్రాప్‌లో కథ జరుగుతుందని చెప్పగానే నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు. నందు అద్భుతమైన కథ రాశాడు. ప్రతి పాత్రకు కథలో ఎంతో ప్రాధాన్యం ఉంది. భాగ్యశ్రీ పోషించిన భారతి పాత్ర ఈ సినిమాకు హార్ట్‌బీట్ లాంటిది,” అన్నారు.
అఖిల్ పాత్రలోని భావోద్వేగాలకు అతని వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాలు కూడా తోడయ్యాయని నాగార్జున చెప్పారు. “అఖిల్‌లోని బాధ, కథలోని ఎమోషన్ ఒకటయ్యాయి. అందుకే ఈ పాత్ర అంత బాగా వచ్చింది,” అని పేర్కొన్నారు.
ఈ సినిమాకు నిర్మాతగా మారిన తర్వాత కథ, పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో మరింతగా జోక్యం చేసుకున్నానని ఆయన తెలిపారు. “జూన్‌కే సినిమా సిద్ధమైంది. కానీ టెక్నీషియన్లు మరో రెండు వారాలు సమయం అడగడంతో విడుదలను వాయిదా వేశాం. దాంతో సినిమా మరింత మెరుగైంది. ఓటీటీ కోసం కాదు, థియేటర్ అనుభూతి కోసం ఈ సినిమాను తీర్చిదిద్దాం. లెక్కలు వేసుకోలేదు. కథని నమ్మి చేశాం,” అన్నారు నాగార్జున.
చివరిసారిగా ‘మనం’ సినిమా కోసం ఇంతగా ఇన్వాల్వ్ అయ్యానని, అది తండ్రి కోసం అయితే ఇప్పుడు ‘లెనిన్’ తన కొడుకు కోసం చేశానని నాగార్జున భావోద్వేగంగా చెప్పారు.
“ప్రతి తండ్రి తన కొడుకు విజయం సాధించాలని కోరుకుంటాడు. ‘లెనిన్’పై మాకు ఎంతో నమ్మకం ఉంది. సినిమా చూసిన కాన్ఫిడెన్స్‌తోనే చెబుతున్నా… జూలై 10న వస్తున్నాం… కొడుతున్నాం… మనోడు కొడుతున్నాడు,” అంటూ ఆయన ముగించారు.
