బాంబు పేల్చిన అనుపమ పరమేశ్వరన్

TeluguCinema 13 Aug 2025
Anupama Parameswaran

హీరోయిన్ అనుపమ బాంబు పేల్చింది. కొంతమంది హీరోయిన్లపై పరోక్షంగా సెటైర్ వేసింది. చేతిలో హిట్స్ లేకపోయినా కొంతమందికి ఛాన్సులొస్తున్నాయని, అదే తనకు అర్థం కావడం లేదని అంటోంది.

“హీరోయిన్లకు అవకాశాలు ఎలా వస్తాయో నాకు ఇప్పటికీ అర్థం కాదు. హీరోయిన్లకు మార్కెట్ వాల్యూ ఎలా ఆపాదిస్తారో తెలియదు. కొందరు హీరోయిన్లకు హిట్లు వస్తాయి, కానీ అవకాశాలు రావు. మరికొందరు హీరోయిన్లకు అస్సలు హిట్స్ ఉండవు, కానీ వరుసగా అవకాశాలు వస్తుంటాయి. అది నాకు అర్థం కాదు.”

ఇలా అనుపమ ఉన్నది ఉన్నట్లు చెప్పింది. ఆమె ప్రస్తుతం “పరదా” (Paradha) చిత్రం ప్రమోషన్ లలో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తోంది.

కొంతమందికి చాలా హిట్స్ ఉంటాయి కానీ అందులో మంచి సినిమాలుండవని కూడా చెబుతోంది అనుపమ. ఆమె ఎవర్ని దృష్టిలో పెట్టుకొని ఆ కామెంట్ చేసిందనే విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

తను మాత్రం సక్సెస్-ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా మంచి సినిమాలు చేస్తున్నానని అంటోంది. తనపై ఓ ముద్ర పడిపోయిందని, అందుకే తనకు కొన్ని పాత్రలు దూరమయ్యాయనే విషయాన్ని అనుపమ అంగీకరించింది.

హీరోయిన్లకు ట్రీట్మెంట్, హీరోకు ట్రీట్మెంట్!

Anupama Parameswaran

అలాగే హీరోయిన్లపై ఇండస్ట్రీలో కొంత వివక్ష ఉంది అని చెప్తోంది. “హీరోలకు ప్రత్యేక సౌకర్యాలు, వెసులుబాట్లు ఉంటాయి. ఒక హీరోయిన్ సెట్ కి వచ్చినా ఆమెపై వెంటనే షాట్స్ చిత్రీకరించారు. హీరో ఆ సన్నివేశంలో ఉంటే…హీరో వచ్చేంతవరకు వెయిట్ చేస్తారు. ఎన్ని గంటలు అయినా. అదే హీరోయిన్ లేట్ వస్తే హీరోకి కోపం వస్తుంది అని హీరోతో వేరే సీన్లు తీసేస్తారు,” అని చెప్పింది ఈ భామ.