నిర్మాతలకు ఇబ్బంది కలిగించదట

TeluguCinema 09 Sep 2025
Janhvi Kapoor

హీరోయిన్ జాన్వీ కపూర్ సినిమా కుటుంబం నుంచి వచ్చింది. తల్లి శ్రీదేవి ఒకప్పుడు సూపర్ స్టార్. తండ్రి బోనీ కపూర్ పెద్ద నిర్మాత. ఇక బాబాయ్ అనిల్ కపూర్ ఒకప్పుడు పెద్ద స్టార్. అందుకే, సినిమా నిర్మాతల సాధకబాధకాలు ఆమెకి బాగా తెలుసు.

అందుకే మిగతా హీరోయిన్లలా అన్ని బిల్లులు నిర్మాతకు వెయ్యదట.

“కొన్నిసార్లు తన ట్రావెల్ ఖర్చు తానే భరిస్తుంది. నిర్మాతకు బిల్లు వెయ్యదు. ఇక షూటింగ్ ప్రదేశానికి తనతో ఎవరూ వచ్చినా (నేను అయినా, ఇతర బంధువులు, మిత్రులు అయినా) ఫ్లైట్ టికెట్, హోటల్ ఖర్చు తానే పే చేస్తుంది. తనకు తప్ప మిగతా వారికి నిర్మాతను ఖర్చు పెట్టనివ్వదు,” అని జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

ఒక హీరో, ఒక హీరోయిన్ చుట్టూ ఉండే సిబ్బంది, వాళ్ళ కుటుంబ సభ్యులు, వారికోసం నిర్మాతలు పెట్టే ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. ఈ విషయంలో చాలామంది నిర్మాతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అందుకే, జాన్వీ కపూర్ వంటి హీరోయిన్లు మేల్కొని తన ఖర్చు తప్ప ఇతర వ్యక్తుల ఖర్చును నిర్మాతల అకౌంట్ కి వెయ్యడం లేదంట.

జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. “పెద్ది” సినిమాలో మెయిన్ హీరోయిన్ ఆమె. ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె ప్రతి నెలా హైదరాబాద్ కి గానీ, మైసూర్ కిగానీ ముంబై నుంచి వస్తోంది. తన సిబ్బంది సంఖ్యను ఇప్పుడు తగ్గించింది.