పవన్ విషయంలో అది ‘పులిహోరే’!

TeluguCinema 07 Jul 2021
pawan janasenha july

పేరొందిన మన తెలుగు మీడియా పత్రికలు, న్యూస్ ఛానెల్స్ ఎక్కువగా ‘పులిహోర’ కలుపుతాయి అనే ఒక అపవాదు ఉంది. ‘పులిహోర కలపడం’ అంటే విషయం లేకున్నా కూడా కలర్ ఫుల్ గా వడ్డించడమే. అంటే అబద్ధాలని, ఊహాగానాలను ఘంటాపథంగా చెప్పడం. ముఖ్యంగా ఈ ధోరణి పొలిటికల్ జర్నలిజంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

పవన్ కళ్యాణ్ కి కేబినెట్ హోదా ఇచ్చేందుకు ప్రధానమంత్రి మోదీ సిద్ధమయ్యారని, పవన్ కళ్యాణ్ ఇక హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో దిగనున్నారని 10 రోజుల క్రితం తెలుగు మీడియా హడావిడి చేసింది. అప్పుడే అది నమ్మశక్యంగా లేదని పలువురు కామెంట్ చేశారు.

మన తెలుగు పొలిటికల్ జర్నలిజం స్టాండర్డ్స్ ఏంటో మరోసారి బయటపడింది.

ఈ రోజు ప్రధానమంత్రి తన కేబినెట్ లోకి 43 మంది మంత్రులను తీసుకున్నారు. ఆయన క్యాబినెట్ లో మార్పులు చేర్పులు జరిగాయి. ఇప్పటివరకు సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా పదోన్నతి దక్కింది. ఆంధ్రప్రదేశ్ ఖాతాలో పవన్ కళ్యాణ్ కి మంత్రి పదవి అనేది బుస్సు అని తేలింది. పవన్ కళ్యాణ్ … ప్రస్తుతం విజయవాడలో తన జనసేన పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఆయన లాంగ్ టర్మ్ గోల్స్ తో ఉన్నారు. కేంద్రంలో మంత్రి పదవి దక్కాలంటే పవన్ కళ్యాణ్ ఎంపీ అవ్వాలి. ఆర్నెళ్లలో అయన రాజ్యసభకి కూడా వెళ్లే అవకాశం లేదు. ఇవేవి ఆలోచించకుండా తెలుగు మీడియా హడావిడి చేసింది.