అందులోకి నన్ను లాగొద్దు: పూనమ్

Poonam Kaur


చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ పూనమ్ కౌర్ పేరు మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఆమె తాజాగా ఒక ప్రకటన చేశారు. తనని రాజకీయ వివాదాల్లోకి లాగొద్దు అని అంటున్నారు. ఏ పార్టీ వారైనా వారి రాజకీయాల కోసం తనని, తన పేరును ఉపయోగించొద్దు అని ఆమె కోరుతున్నారు.

ఒక మహిళపై కుట్రలు, కుతంత్రాలు వద్దు అని ఆమె రాజకీయ పార్టీలను అభ్యర్థించారు. తాను ఇప్పుడు చేనేత కళాకారుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నట్లు పేర్కొన్నారు.

“నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు. సమస్య ఆధారంగానే నేను స్పందిస్తుంటాను. ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం నన్ను ఓ పావుగా వాడాలనుకుంటున్నారు. గత ఎన్నికలలో కూడా ఇలాంటి వికృత చేష్టలు చేశారు. మరికొందరు పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు. సానుభూతి పేరుతో నాకు, నా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తున్నారు కొన్ని పార్టీలకు చెందిన నాయకులు. వారి లక్ష్యం ఏంటో నాకు తెలుసు,” అని పూనమ్ కౌర్ కుండబద్దలు కొట్టారు.

“నేను సిక్కుబిడ్డను. మాకు త్యాగాలు తెలుసు. పోరాటాలు తెలుసు,” అని కూడా హెచ్చరించారు పూనమ్.

“దయచేసి నన్ను మీ రాజకీయాల కోసం నన్ను లాగొద్దు. చేనేత, మహిళా ఉద్యమాలను జాతీయస్థాయిలో నిర్మించే క్రమంలో ఉన్నాను. నా వైపు నుండి ఏదైనా అప్డేట్ ఉంటే నేనే స్వయంగా తెలియజేస్తాను,” అని ముగించారు పూనమ్.

Advertisement
 

More

Related Stories