పునీత్ ఫ్యామిలీకి చరణ్ పరామర్శ

TeluguCinema 03 Nov 2021
ramcharan puneeth

కన్నడ పవర్ స్టార్ గా పేరొందిన పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం అందర్నీ షాక్ కి గురి చేసింది. తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన సెలెబ్రిటీలతో పునీత్ రాజ్ కుమార్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన మరణవార్త వినగానే నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, ఎన్టీఆర్, వెంకటేష్, శ్రీకాంత్, రానా, అలీ వంటి నటులు బెంగుళూర్ వెళ్లి, భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

రామ్ చరణ్ కూడా వెళ్లాలనుకున్నా కుదరలేదు. అప్పుడు చరణ్ …శంకర్ తీస్తున్న భారీ యాక్షన్ సీన్ షూటింగ్ కోసమని పూణేలో ఉన్నారు. కీలకమైన ఫైట్ సీన్ అది. మధ్యలో వదిలేసి రాలేని పరిస్థితి. సో, షూటింగ్ పూర్తి కావడంతో ఈ రోజు బెంగుళూర్ వెళ్లి పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ ఫోటోకి నమస్కరించి నివాళులు ఇచ్చారు.

పునీత్ సోదరుడు, ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ ని ఓదార్చారు. “మా సొంత కుటుంబ సభ్యుడిలాంటి వారు పునీత్. ఆయనతో నాకు మంచి ఫ్రెండ్సిప్ ఉంది.ఆయన లేరన్న విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. పునీత్ చాలా నిజాయితీగల వ్యక్తి,” అని రామ్ చరణ్ అన్నారు.

డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూలు నిన్నటితో పూర్తి అయింది. పూణే, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ ఫైట్ సీన్ తీశారు.