
వరుసగా హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు సత్యదేవ్. కొన్ని హిట్స్ కూడా వచ్చాయి. చేతిలో చాలా సినిమాలున్నాయి. ఇంత బిజీగా ఉన్న ఈ హీరో తెలుగులో చిరంజీవి సినిమాలో ఒక కీలక పాత్ర, హిందీలో అక్షయ్ కుమార్ సినిమా లో మరో కీలక పాత్ర పోషించేందుకు ఒప్పుకోవడం విశేషం. చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’లో సత్యదేవ్ నెగెటివ్ ఛాయలున్న రోల్.
ఇక అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’లో హీరోతోనే ఉండే పెద్ద పాత్ర. బాలీవుడ్ లో మొదటి చిత్రం సత్యదేవ్ కి. హీరోగా సెటిల్ అయిన తర్వాత ఇలాంటి పాత్రలు ఎందుకు చేస్తున్నట్లు? “అందరిలానే సోలో హీరోగా చేయాలనే వుంటుంది. అయితే మంచి పాత్రలు దొరికితే చిన్నదా పెద్దదా నెగిటివా పాజిటివా అని చూడకుండా అవి కూడా చేస్తాను. పాత్ర ఎక్సయిట్ చేస్తే ఏదైనా చేస్తాను, అని జవాబు ఇచ్చారు సత్యదేవ్.
“రాజమౌళి, సుకుమార్, పూరి జగన్నాథ్ ఇలా అందరి పెద్ద దర్శకులతో చేయాలని ఉంది,” అని తన డ్రీం గురించి చెప్పారు. ఇప్పటికే పూరి డైరెక్షన్లో రెండు సినిమాలు చేశారు.
సత్యదేవ్ చేతిలో హీరోగా పలు సినిమాలున్నాయి. “గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ, రామ్ సేతు విడుదలకు సిద్దంగా వున్నాయి. ‘ఫుల్ బాటిల్’ అనే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది. కన్నడ నటుడు డాలీ ధనుంజయ తో కలసి ఓ యాక్షన్ థ్రిల్లర్ ఒప్పుకున్నా,” అని వివరించారు.