సోను సూద్ సరసన నిధి అగర్వాల్

TeluguCinema 04 Aug 2021
nidhhi agerwal sonu sood song


సోను సూద్ ఇప్పుడు జనాలకు హీరో. సినిమాల్లో విలన్ వేషాలు వేస్తారు కానీ ఆయన తన సేవాగుణంతో సూపర్ స్టార్లకన్నా ఎక్కువ ప్రజాదరణ పొందారు. ఇప్పుడు మనదేశంలో ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక ఆడియో కంపెనీ సోను సూద్ ని హీరోని చేసింది.

ఇటీవల హిందీలో పెద్ద హీరోలు, హీరోయిన్లతో ప్రైవేట్ సాంగ్స్ తీయడం ఒక ట్రెండ్ గా మారింది. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, శ్రద్ధ కపూర్ వంటి టాప్ స్టార్స్ యూట్యూబ్ కోసం పాటల్లో నటించారు. అదే కోవలో సోను సూద్ హీరోగా ఒక గీతాన్ని ప్లాన్ చేసింది ఒక ఆడియో కంపెనీ. “సాత్ క్యా నిభావోగే” (Saath Kya Nibhaoge) అని సాగే ఈ పాటలో ఆయన సరసన నిధి అగర్వాల్ నటించడం విశేషం.

నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది. తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి ఈ భామకి. ఐతే, ‘రియల్ లైఫ్ హీరో’ సోను సూద్ సరసన నటించి మరింత పాపులర్ కావాలనుకుంటోంది ఈ భామ. ఈ పాట త్వరలోనే విడుదల కానుంది.

సోను సూద్ కూడా ఇప్పుడు డబ్బులు సంపాదించుకునే పనిలో పడ్డారు. అందుకే ఈ పాట ఒప్పుకున్నారు. తన సంపాదనలో అధికభాగం ఛారిటీకే వినియోగిస్తారు సోను సూద్.