శివలో పాప, ఇప్పుడు ఇలా

1989లో విడుదలైన “శివ” సినిమాలో బేబీ కీర్తిగా నటించిన అమ్మాయి గుర్తుందా? ఆ పాపని సైకిల్ పై కూర్చొండబెట్టుకొని నాగార్జున ఛేజింగ్ లో పాల్గొనే ఎపిసోడ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ ఛేజింగ్ లో నాగార్జునతో పాటు భయం లేకుండా నటించిన కీర్తి అసలు పేరు సుష్మ.
ఆమె ఇప్పుడు అమెరికాలో ఉంటోంది. సుష్మ ఆనంద్ ఆకోజ్ అనే సుష్మ ప్రస్తుతం అమెరికాలో పీహెచ్ డీ చేస్తున్నారు. డేటా సైన్స్, ఏఐ రంగాల్లో ఆమె ఎక్స్ పర్ట్.
తాజాగా “శివ” మరోసారి విడుదల అవుతున్న సందర్భంగా ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందో రామ్ గోపాల్ వర్మ జనాలకు తెలియచేశారు. అంతేకాదు, అప్పట్లో సినిమా బాగా రావాలనే ఉద్దేశంతో ఒక చిన్నపిల్లని అలాంటి ప్రమాదకర సన్నివేశంలో ఎలాంటి డూప్ లేకుండా చేయించినందుకు ఇప్పుడు వర్మ క్షమాపణలు కోరారు. ట్విట్టర్ లో ఆమెని ట్యాగ్ చేసి సారీ చెప్పారు.
రామ్ గోపాల్ వర్మ ట్వీట్ కి ఆమె ఇంకా స్పందించలేదు. ఈ యాక్షన్ సీన్ నాగార్జున ఎలాంటి డూప్ లేకుండా చేశారు. ఆయనతో పాటు సుష్మ కూడా భయం భయంగానే సైకిల్ పై కూర్చొంది.
“శివ 4కే” ఎల్లుండి (నవంబర్ 14) విడుదల కానుంది.