రిలీజ్ కు ముందు Rs 400 కోట్లు

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన “జన నాయగన్” (తెలుగులో “జన నాయకుడు”) సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. విజయ్ కి ఇదే చివరి చిత్రం అవుతుంది అనే ఒక వాదన ఉంది.
వచ్చే ఏడాది వేసవిలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తన పార్టీని బరిలో దింపుతున్నారు. సీఎం అవ్వాలనే లక్ష్యంతో ఉన్నారు. గెలిచినా, ఓడినా సినిమాలను ఇప్పట్లో చెయ్యకూడదని అనుకుంటున్నారట. మళ్ళీ పవన్ కళ్యాణ్ లా రీఎంట్రీ ఇస్తారో లేదా అన్నది ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఐతే ఇదే చివరి చిత్రం అన్నట్లుగా ప్రచారం మొదలైంది.
దాంతో, “జన నాయగన్”కి బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఉంది. థియేటర్ హక్కులు, నాన్ థియేటర్ హక్కుల ద్వారా దాదాపు 400 కోట్లు ఇప్పటికే వచ్చాయి అని అంటున్నారు.
తమిళనాడు థియేటర్ హక్కులు: రూ. 100 కోట్లు
అమెజాన్ ప్రైమ్ ఓటిటి హక్కులు: రూ. 110 కోట్లు
ఓవర్సీస్ హక్కులు: రూ. 80 కోట్లు
మ్యూజిక్ రైట్స్: రూ. 35 కోట్లు
కేరళ, కర్ణాటక, తెలుగు, నార్త్ ఇండియా: 55 కోట్లు
దాదాపుగా 400 కోట్ల వరకు వ్యాపారం జరిగింది.
విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ఎచ్. వినోద్ దర్శకుడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మమిత బైజు విజయ్ కి మేనకోడలుగా కనిపించనుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాని KVN Productions నిర్మిస్తోంది. తెలుగులో బాలయ్య హీరోగా రూపొందిన “భగవంత్ కేసరి” సినిమా కథ ఆధారంగా ఇది రూపొందుతోంది అని టాక్.