
సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్‌బాబు (Ashok Kumar Babu)పై సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓ యువకుడిని హీరోగా పరిచయం చేస్తానని నమ్మబలికి అతని తల్లిదండ్రుల నుంచి సుమారు రూ.3.5 కోట్లు తీసుకుని, హామీని నెరవేర్చకపోవడంతో పాటు డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపణలు వచ్చాయి.
బాధిత యువకుడి తండ్రి హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మాత విజయలక్ష్మి, దర్శకుడు గుడ్లూరి అశోక్‌బాబులను విచారణకు పిలిచి ఈఓడబ్ల్యూ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
హనుమంతరావు ఫిర్యాదులో, తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తానని చెప్పి అశోక్‌బాబు పలుమార్లు డబ్బులు తీసుకున్నారని, అయితే సినిమా చేయకపోవడమే కాకుండా తీసుకున్న మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించలేదని పేర్కొన్నారు.
గుడ్లూరి అశోక్‌బాబు గతంలో భాగమతి, పిల్ల జమీందార్, ఆకాశ రామన్న తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
