
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ ముఖ్యంగా సునీల్ తో ఆయన పంజాగుట్ట రూమ్ లో ఉన్నప్పుడు అనుభవించిన కష్టాలు మాత్రమే చాలామందికి తెలుసు. కానీ అంతకంటే ముందు ఆయన కటిక పేదరికాన్ని అనుభవించాడు. ఆ విషయాన్ని ఓ సందర్భంలో పోసాని బయటపెట్టారు.
ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన రోజుల్లో పోసాని దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి వచ్చారంట త్రివిక్రమ్. రోజూ పోసాని ఇంటికి వెళ్లేవారంట. అయితే అప్పట్లో పోసాని ఉదయం 6 గంటలకే ఇంటి నుంచి వెళ్లిపోయి, తిరిగి రాత్రి 10 గంటలకు వచ్చేవారంట. ఎప్పుడూ త్రివిక్రమ్ ను కలవలేదు.
ఓసారి హాస్యనటుడు గౌతంరాజు, త్రివిక్రమ్ గురించి పోసానికి చెప్పారంట. పేదవాడు ఓ అవకాశం ఇవ్వమని కోరారండ. మంచివాడైతే అవకాశం ఇస్తానన్నారట పోసాని. గౌతంరాజు చెప్పడంతో త్రివిక్రమ్ ను తన టీమ్ లోకి చేర్చుకున్నట్టు తెలిపారు పోసాని.
ఆ టైమ్ లో పోసాని ఏదో పని మీద చెన్నైలో ఉన్నారంట. కలవడానికి త్రివిక్రమ్ ను చెన్నై రమ్మన్నారంట. అయితే త్రివిక్రమ్ దగ్గర అన్ని డబ్బుల్లేవ్. దీంతో గౌతంరాజు తన చేతికున్న బ్రాస్ లెట్ ను కుదువ పెట్టి, ఆ డబ్బిచ్చి త్రివిక్రమ్ ను చెన్నైకి పంపించారంట.
అంతకంటే ముందు, సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ, పిల్లలకు ట్యూషన్లు చెప్పేవారంట త్రివిక్రమ్. అలా గౌతంరాజుకు, త్రివిక్రమ్ పరిచయం ఏర్పడింది.
