బండ్లకి, విజయ్ కి గొడవేంటి?

బండ్ల గణేష్ ఒకప్పుడు పెద్ద నిర్మాతే. కానీ ఆర్థిక సమస్యలు, అప్పులు ఎగ్గొట్టడాలు, చెక్ బౌన్స్ కేసులతో హవా కోల్పోయాడు. ఎన్టీఆర్ తో తీసిన “టెంపర్” (2015) మళ్ళీ సినిమా తీయలేదు. ఐతే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ పార్టీ అధికారంలో ఉండడంతో ఇప్పుడు బండ్ల గణేష్ హంగామా ఎక్కువైంది.
ఆయన మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ మొదలు పెడుతాడట. ఆయన కొత్త సినిమా సంగతేమో గానీ, ఇటీవల ప్రతి మూవీ ఫంక్షన్ కి హాజరై స్పీచ్ లు ఇస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవిని పొగడం కామన్. ఐతే, మిగతా హీరోలను విమర్శించడం మాత్రం వింతగానే ఉంది.
తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన “కె-ర్యాంప్” సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ విజయ్ దేవరకొండని టార్గెట్ చేసి కామెంట్స్ చేశాడు. విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించలేదు. కానీ, అతన్నే టార్గెట్ చేశాడని అర్థం అవుతోంది.
” లూజు లూజు ప్యాంట్లు, కొత్త కొత్త చెప్పులు వేసుకొని… వాసప్ వాసప్ బాయ్స్ అంటే హిట్స్ రావు. ఒక్క హిట్ కొట్టగానే సుకుమార్ కావాలి, రాజమౌళి కావాలి అంటే ఎట్లా. కిరణ్ అబ్బవరం ని చూస్తుంటే తొలినాటి చిరంజీవి గుర్తొస్తున్నాడు,” అని బండ్ల గణేష్ స్పీచులో పేర్కొన్నారు.
ఆ మధ్యనేమో విజయ్ దేవరకొండ తండ్రి వర్ధన్, తాను మద్రాస్ లో ఒకే చోట ఉండేవాళ్ళం అనీ బండ్ల తెలిపారు. విజయ్ దేవరకొండ పుట్టగానే హీరో పుట్టాడు నీకు అని వర్ధన్ కి చెప్పినట్లు బండ్ల అన్నారు. ఇప్పుడు ఏమో విజయ్ ని టార్గెట్ చేసి మాట్లాడారు. ఇద్దరి మధ్య ఏమి జరిగింది? బహుశా డేట్స్ అడిగితే ఇవ్వలేదేమో అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటున్నారు.