
కొంతమంది దర్శకులతో కలిసి పనిచేయాలని నానికి ఎప్పట్నుంచో ఉంది. దానికి సంబంధించి అతడి దగ్గర ఓ లిస్ట్ కూడా ఉంది. మణిరత్నం, శేఖర్ కమ్ముల లాంటి దర్శకులతో వర్క్ చేయాలనేది నాని డ్రీమ్. ఈ లిస్ట్ లో దేవ కట్టా కూడా ఉన్నాడు.
దేవ కట్టాతో కలిసి పనిచేయాలని నానికి చాన్నాళ్లుగా కోరిక ఉంది. దేవ కట్టా కూడా సిద్ధమే కానీ కథ సెట్ అవ్వక చేయట్లేదు. అయితే ఈసారి మాత్రం నాని-కట్టా కలిసి సినిమా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై దేవ కట్టా స్పందించాడు. ప్రస్తుతానికి తనకు అలాంటి ఆలోచన లేదని, తామిద్దరి మధ్య కనీసం కథా చర్చలు కూడా జరగలేదని స్పష్టం చేశాడు.
ఈ దర్శకుడు ప్రస్తుతం “‘మయసభ: రైజ్ ఆఫ్ ది టైటాన్స్” వెబ్ సిరీస్ పనిలో బిజీగా ఉన్నాడు. 3 సీజన్లుగా రాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో ఒక సీజన్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.
అలాగే, రాజమౌళి మహేష్ బాబుతో తీస్తున్న భారీ చిత్రానికి దేవ కట్టా మాటలు రాస్తున్నాడు అని ప్రచారం ఉంది. “ఈ సినిమాకి నేను మాటలు రాస్తున్నానా లేదా అనేది ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే ఇది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు,” అని అంటున్నారు దేవ కట్టా.





