
ధనుష్ ఇటీవల నటిస్తున్న సినిమాలు చూస్తే అతని డబ్బులే కోసమే వీటిని ఒప్పుకుంటున్నాడా అనిపిస్తోంది. రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న ధనుష్ కి ‘మంచి’ కథలు సెలెక్ట్ చేసుకునే నాలెడ్జ్ ఉందని అంటారు. కానీ, రీసెంట్ గా ఆయన చేసిన ‘జగమే తందిరం’, తాజాగా విడుదలైన ‘మారన్’ చిత్రాలు చూస్తే మనం వేరే మాట మాట్లాడాల్సి వస్తుంది.
‘మారన్’ అనే పేరుతో నిన్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కొత్త చిత్రం విడుదలైంది. డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలైన చిత్రం ఇది. ధనుష్, మాళవిక మోహన్, స్మృతి నటించిన ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకుడు. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘తలాతోక లేని’ చిత్రం. హాట్ స్టార్ లో ఈ సినిమాని మీరు స్ట్రీమ్ చెయ్యాలనుకుంటే పక్కన జండూబామో, అమృతాంజనమో పక్కన పెట్టుకోవాలి.
అర్థంపర్థం లేని కథనే సమస్య అనుకుంటే… దర్శకుడి తీత, అతని రాత (స్క్రీన్ ప్లే) మరింత ఘోరం. ఈ మధ్యకాలంలో తమిళ సినిమాలన్నీ పాత చింతకాయ పచ్చడి కథ, కథనాలతోనే రూపొందుతున్నాయి. వాటి అన్నటిలో ఇది మరీ నాసిరకం.
ధనుష్ సినిమా అంటే భయపడి స్థితికి వచ్చింది. ఆయన ఇప్పుడు తెలుగులో కూడా అడుగుపెడుతున్నారు. రెండు వరుస ఫ్లాపులు ఇచ్చిన దర్శకుడు వెంకీ అట్లూరి కథని ఒప్పుకొని చేస్తున్నారు. “సార్” అనే పేరుతో రూపొందుతోంది. మరి, ధనుష్ ఈ సారి ఏమి చేస్తాడో.