
“జెర్సీ” సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఇప్పుడు “కింగ్ డమ్” సినిమా తీశారు. ఈ సినిమాకి మొదట అనుకున్న పేరు మాత్రం ఇది కాదంట.
“కథ రాసే సమయంలో వేరే టైటిల్స్ అనుకున్నా. ఇందులో తెగ నాయకుడి పేరు ‘దేవర నాయక’. దాంతో అదే టైటిల్ పెట్టాలనుకున్నాం. కానీ, ఎన్టీఆర్ గారి దేవర రావడంతో.. మరో కొత్త టైటిల్ చూశాం. ‘యుద్ధకాండ’ అనే టైటిల్ ను పరిశీలించాం కానీ, చివరికి ‘కింగ్‌డమ్’ని ఖరారు చేశాం,” అని వివరణ ఇచ్చారు గౌతమ్.
విజయ్ తోనే ఈ సినిమా చెయ్యడానికి కారణం కూడా చెప్పారు. “ఈ కథ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఈ కథకు తగ్గ నటుడు దొరికినప్పుడు చేయాలనే ఉద్దేశంతో.. పూర్తిస్థాయిలో డెవలప్ చేయనప్పటికీ, కథను రాసి పెట్టుకున్నాను. మొదట విజయ్ గారితో చేద్దామనుకున్న కథ వేరు. కానీ, మా ప్రయాణం మొదలైన తరువాత.. విజయ్ గారికి ఈ కథ సరిగ్గా సరిపోతుంది అని భావించి, ఆయనకు చెప్పడం జరిగింది. విజయ్ గారికి కూడా ఈ కథ చాలా నచ్చింది,” అని అంటున్నారు.
కింగ్‌డమ్ రెండో భాగం ఎప్పుడు మొదలవుతుంది? “రెండో భాగానికి సంబంధించిన మూల కథ ఉంది. స్క్రిప్ట్ వర్క్ కూడా త్వరలో ప్రారంభిస్తాం. అయితే పార్ట్-2 కంటే ముందుగా.. మురుగన్, సేతు పాత్రల నేపథ్యంలో ఓటీటీ కోసం ఓ వెబ్ ఫిల్మ్ చేయాలని భావిస్తున్నాము.”





