
మలైక అరోరాని ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు మల్ల (Malla) అని ముద్దుగా పిలుచుకుంటారట. ఈ మల్ల 50వ పుట్టిన రోజు జరుపుకొంది తాజాగా. ఐదేళ్ల క్రితమే ఆమె 48వ పుట్టిన రోజు జరుపుకొంది. అయినా ఇప్పుడికింకా నాకు యాబ్భై అని చెప్తోంది మల్ల.
ఇటీవల ఆమె తన పుట్టిన రోజు (అక్టోబర్ 23) వేడుకల్లో 50వ నెంబర్ పెట్టి కేక్ కట్ చేసింది. అప్పుడే అందరూ కామెంట్ చేశారు. 53వ పుట్టిన రోజు జరుపుకోవాల్సిన ఈ భామ మూడు ఏళ్ళు కరోనా అకౌంట్ లో డిస్కౌంట్ వేసింది అని అందరూ కామెడీ చేసారు.
ఐతే, తాజాగా ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో ఆ వేడుకల ఫోటోలను షేర్ చేసింది. అంతే కాదు, తన 50వ పుట్టిన రోజుకి శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు అంటూ మరోసారి 50 అని క్లారిటీ ఇచ్చింది.
“నా గుండె ఆనందంతో నిండిపోయింది. మీ ప్రేమ, శుభాకాంక్షలను పంచి నా 50వ పుట్టినరోజును నిజంగా ప్రత్యేకంగా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇంత అందమైన వేడుకను నిర్వహించడంలో నాకు సాయం చేసిన వారందరికీ స్పెషల్ థాంక్స్,” అంటూ ఆమె ఇది తన 50వ పుట్టిన రోజు వేడుక అని తెలిపింది.

ఐతే, ఈ మల్ల… మళ్ళా మళ్ళా 50వ పుట్టిన రోజు జరుపుకోవడం విచిత్రంగానే ఉంది. ఎందుకంటే ఆమె పుట్టింది 1973లో.





