నానికి పోటీగా వరుణ్ తేజ్

Ghani and Shyam Singha Roy

సోలోగా పండగ చేసుకుందామని అనుకున్నారు నాని. క్రిస్మస్ పండుగ సెలవులని తనే అడ్వాంటేజ్ గా తీసుకోవాలని నాని వేసిన ప్లాన్ వర్క్ అవుట్ కావట్లేదు. నానికి పోటీగా వరుణ్ తేజ్ రంగంలోకి దిగాడని చెప్పాలి.

అనేకసార్లు వాయిదాపడ్డ వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా ‘గని’ తాజాగా కొత్త డేట్ ప్రకటించింది. డిసెంబర్ 24కి డేట్ ఫిక్స్ చేసుకొంది ‘గని’. ఆ డేట్ కి వస్తుందా, మళ్ళీ వాయిదా పడుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేం. తాజాగా ప్రకటించిన డేట్ ప్రకారం నాని, వరుణ్ తేజ్ మధ్య పోటీ తప్పదు. నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా ఇప్పటికే డిసెంబర్ 24 తమ విడుదల తేదీ అని ప్రకటించింది. ప్రొమోషన్ కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు పోటీగా వరుణ్ తేజ్ ‘గని’ చిత్రం వస్తోంది.

నాని గతేడాది ‘వి’ సినిమాని డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. ఈ ఏడాది ఇప్పటికే ‘టక్ జగదీష్’ సినిమా విషయంలో కూడా అలాగే చేశారు. ఇలా వరుసగా రెండు సినిమాలను థియేటర్లలో విడుదల చెయ్యకుండా ఓటిటిలో విడుదల చెయ్యడంతో నాని అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని థియేటర్లో భారీ ఎత్తున విడుదల చేసి విమర్శకుల నోళ్లు మూయించాలనేది నాని ప్లాన్. అందుకే, చాలా ముందుగా క్రిస్మస్ కి తన సినిమా వస్తుందని నాని ప్రకటించారు.

ఐతే, నానికి ఇప్పడు సోలో రిలీజ్ బెనిఫిట్ లేకుండా వరుణ్ చేస్తున్నారు. రెండు సినిమాలు పోటీ పడితే కలెక్షన్ల విషయంలో తేడా కొడుతోంది. ఇప్పటికే నానికి థియేటర్ మార్కెట్ తగ్గింది అన్న కామెంట్స్ వున్నాయి. మరి ఈ టైంలో పోటీ అంటే కొంత నష్టమే.

Advertisement
 

More

Related Stories