
దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన “హనుమాన్” అనూహ్య విజయం సాధించింది. తెలుగులోనే కాదు హిందీలో కూడా బాగా ఆడింది. ఆ సినిమా విజయగర్వంతో ప్రశాంత్ వర్మ అనేక సినిమాలు ప్రకటించాడు. తన “కథ”తో సినిమాలు అనీ, తన “సినిమా యూనివర్స్”లో సినిమాలు అంటూ మరికొన్ని ప్రకటించాడు.
అలాగే ప్రభాస్, రిషబ్ శెట్టి, రణ్వీర్ సింగ్, బాలయ్య కొడుకు మోక్షజ్ఞతో సినిమాలు అంటూ హంగామా చేశాడు. ఇందులో ఏవీ వర్కవుట్ కాలేదు ఇప్పటివరకు. పైగా నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకొని ఇప్పుడు ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి వద్ద కేసులు ఎదుర్కొంటున్నాడు.
ఇందులో మిగతా సినిమాల సంగతి ఎలా ఉన్నా “జై హనుమాన్” ముఖ్యం. ఎందుకంటే సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గా ప్రకటించిన “జై హనుమాన్” మొదలు పెడితే ఆటోమాటిక్ గా క్రేజ్ వస్తుంది. అంతేకాకుండా హనుమాన్ పాత్రధారిగా రిషబ్ శెట్టి నటించేందుకు ఒప్పుకున్నాడు. ఐతే సమస్య ఏంటంటే ఇప్పుడు “కాంతార చాప్టర్ 1” విజయం తర్వాత రిషబ్ శెట్టి “జై హనుమాన్”కి అంగీకరిస్తాడా? పారితోషికం విషయంలో కండీషన్లు పెడుతాడా?
అలాగే, ఈ సినిమాని నిర్మించేందుకు ముందుకొచ్చిన మైత్రి సంస్థకు, “హనుమాన్” నిర్మించిన ప్రైమ్ ఎంటర్టైన్మెంట్ కి మధ్య జరుగుతున్న లీగల్ వార్ కొలిక్కి వస్తుందా? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు ఉన్నాయి.





