
నాని (Nani) ఎంతో ఇష్టంగా మొదలుపెట్టారు ది ప్యారడైజ్ (The Paradise) సినిమాని. ఇష్టపడడమే కాదు కష్టపడి చేస్తున్నారు. ఐతే, ఎంత ఇష్టమున్నా అనుకున్న టైంకి షూటింగ్ కాకపోతే ఉండే ఇబ్బంది వేరు. గతేడాది రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఏడాదిలోపు సినిమా విడుదల చెయ్యాలనే లక్ష్యంతో మొదలుపెట్టి మార్చి 26, 2026 అనే డేట్ ప్రకటించారు. కానీ ఆ డేట్ కి సినిమా సగభాగం కూడా పూర్తి కాలేదు.
ఆ తర్వాత ఆగస్టు 2026 అని డేట్ చెప్పారు. ఇప్పుడు అది కూడా మిస్ అయింది. దాంతో కొత్త డేట్ కోసం కుస్తీ పడుతున్నారు. షూటింగ్ ఆలస్యం కావడం కన్నా మరో ప్రాజెక్ట్ మిస్ అయ్యేలా ఉంది అని నాని వర్రీ అవుతున్నారట.
“ది ప్యారడైజ్” సినిమా షూటింగ్ మధ్యలోనే నాని సుజీత్ దర్శకత్వంలో “బ్లడీ రోమియో” (Bloody Romeo) అనే సినిమా మొదలుపెట్టారు. కానీ ప్యారడైజ్ షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో సుజీత్ ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో సుజీత్ కి పవన్ కళ్యాణ్ నుంచి కాల్ వచ్చింది. “ఓజీ 2” పనులు మొదలు పెట్టుకో అని పవన్ కళ్యాణ్ సుజీత్ కి చెప్పారు.
సుజీత్ ఇప్పటివరకు “ఓజీ 2″ని ఎప్పుడు స్టార్ట్ చేస్తానో అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ నాని సెప్టెంబర్ లోపు ‘ప్యారడైజ్’ని పూర్తి చెయ్యకపోతే సుజీత్ పవన్ కళ్యాణ్ సినిమా మొదలుపెట్టే అవకాశం ఉంది. మొదట సుజీత్ “బ్లడీ రోమియో” పూర్తి చేసి ఆ తర్వాత “ఓజీ 2” చేద్దామనుకున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే “ఓజీ 2″ని ముందు మొదలుపెట్టాల్సి వచ్చేలా ఉంది.
పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చే దాన్ని బట్టి సుజీత్ ప్లానింగ్ ఉంటుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ వెంటనే మొదలుపెడదామని చెప్తే సుజీత్ “బ్లడీ రోమియో” వదులుకోవాల్సి వస్తుంది. అదే ఈ పాటికి షూటింగ్ మొదలై ఉండి ఉంటే నాని సినిమా పూర్తి చేసుకొని వస్తాను అని సుజీత్ కూడా పవన్ కళ్యాణ్ కి చెప్పే అవకాశం ఉండేది.
అందుకే నాని ఇప్పుడు సుజీత్ సినిమా చేజారుతుందా అని వర్రీ అవుతున్నారు అని ఇన్ సైడ్ టాక్.
