
తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటించిన ‘ఓ..! సుకుమారి’ (Oh Sukumari) చిత్రం విడుదలకు సిద్ధమైంది. రొమాన్స్, కామెడీ, పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి భరత్ దర్శన్ కథ, దర్శకత్వం వహించారు. ‘శివం భాజే’ విజయానంతరం గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు.
ట్రైలర్‌ను బట్టి చూస్తే, దామిని అనే యువతిని ఎవరైనా తాకితే వారికి కరెంట్ షాక్ తగులుతుందనే విచిత్రమైన సమస్యతో కథ ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి ఆమెకు హీరోతో పెళ్లి చేస్తారు. పెళ్లి తర్వాత అసలు విషయం తెలిసిన హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? భార్యాభర్తలు ఈ సమస్యను ఎలా అధిగమించారు? చివరకు వారి జీవితంలో ప్రేమ, ఆనందం ఎలా చోటుచేసుకున్నాయి? అనే అంశాల చుట్టూ కథ సాగనున్నట్లు ట్రైలర్ వెల్లడిస్తోంది.
అమాయకమైన పల్లెటూరి యువకుడి పాత్రలో తిరు వీర్ సహజంగా కనిపించగా, ఐశ్వర్య రాజేష్ తన పాత్రలో ఆకట్టుకున్నారు.
కామెడీ, ప్రేమ, భావోద్వేగాలను సమపాళ్లలో మేళవించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘ఓ..! సుకుమారి’ ట్రైలర్ ఆసక్తిని పెంచింది. ఈ చిత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
