
మిల్కీబ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) ప్రేమ పట్ల తనకున్న ఆలోచనను బయటపెట్టింది. ప్రేమ అనేది ఒక లావాదేవీ కాదంటోంది. అంటే, మనం ఎదుటివారికి ఏదో ఇస్తున్నాం కాబట్టి, వారి నుండి తిరిగి ఏదో ఆశించడం ప్రేమ అనిపించుకోదని చెబుతోంది. అది ఎటువంటి షరతులు లేనిదై ఉండాలని, ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించడమే నిజమైన లవ్ అని చెబుతోంది.
సాధారణంగా జీవితంలో ఒకేసారి ప్రేమ పుడుతుందని చాలామంది భావిస్తారు, కానీ తమన్నా దీనితో విభేదిస్తోంది.
మనం డిసైడ్ అయితే, ప్రేమ అనేది ఎన్నిసార్లయినా పుడుతుందని చెబుతుంది. అయితే ఆ ప్రేమను ఇవ్వడానికి లేదా స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలని చెబుతోంది. జీవితంలో ఎన్నిసార్లయినా ప్రేమలో పడే అవకాశం ఉంటుందని, అది కేవలం ఒక్కరికే పరిమితం కావాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెబుతోంది తమన్నా.
తమన్నా మాటల్లో చెప్పాలంటే, సంబంధాలు అనేవి మనల్ని బంధించేవిగా కాకుండా, మన ఎదుగుదలకు తోడ్పడేవిగా ఉండాలి. పరస్పర గౌరవం ఉన్న చోటే నిజమైన ప్రేమ వెల్లివిరుస్తుందని ఆమె అంటోంది. ఇవన్నీ చూస్తుంటే, ఈ బ్యూటీ మరోసారి ప్రేమలో పడినట్టు కనిపిస్తోంది.
