
సారా అర్జున్ (Sara Arjun) ప్రస్తుతం యమా పాపులారిటీ పొందింది. క్రేజ్ కూడా మాములుగా లేదు. ధురంధర్ సినిమా మొదటి భాగంలో రణ్వీర్ సింగ్ కి ప్రియురాలిగా, ఆ తరువాత రెండో భాగంలో అతని భార్యగా, ఒక బాబుకి తల్లిగా నటించింది. 20 ఏళ్లకే అద్భుతమైన మెచ్యూరిటీతో కూడిన నటన చూపింది. దాంతో ఆమెకి బాలీవుడ్ లో చాలా ఆఫర్స్ వస్తున్నాయి.
ఈ భామ ఇప్పటికే తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. గుణశేఖర్ తీసిన “యుఫొరియా”లో ఆమె మెయిన్ హీరోయిన్. ఇక తమిళ్ లో కూడా ఆమె హీరోయిన్ గా అరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది.
నిజానికి సారా అర్జున్ కి తమిళ చిత్రసీమ కొత్త కాదు. బాలనటిగా హీరో విక్రమ్ కి కూతురిగా “దైవ తిరుమగళ్” (“Deiva Thirumagal”) సినిమాలో నటించింది. అలాగే మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో ఐశ్వర్య రాయ్ గా నటించింది. ఐశ్వర్య రాయ్ పోషించిన పాత్ర టీనేజ్ కి సంబంధించిన సన్నివేశాల్లో సారా అర్జున్ ఐశ్వర్యగా కనిపించింది.
ఐతే ఇప్పుడు అక్కడ హీరోయిన్ గా ఆమెకి అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే ఆమె హీరోయిన్ గా నటించే తమిళ చిత్రం వివరాలు బయటికి వస్తాయట. ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి అని టాక్.
