ఎపిక్ నుంచి ఇవి కట్

‘బాహుబలి’ రిలీజై పదేళ్లు పూర్తయిన సందర్భంగా 2 భాగాల్ని కలిపి సింగిల్ పార్ట్ గా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. స్వయంగా రాజమౌళి పర్యవేక్షణలో ఈ సినిమా ఎడిటింగ్ పనులు నడుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో.. ‘బాహుబలి ఎపిక్’ నిడివి ఎంత ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. 2 సినిమాలు కలిపితే దాదాపు ఐదున్నర గంటల నిడివి ఉంది. దీన్ని అటుఇటుగా 3 గంటలకు లేదా ఇంకో 15 నిమిషాలు ఎక్కువ రన్ టైమ్ తో సింగిల్ మూవీగా మార్చాలనేది ప్లాన్.
దీంతో ఏ సన్నివేశాలు తీసేయాలనే చర్చ రాజమౌళి కుటుంబంలో జోరుగా నడుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ప్రకటించాడు. ఆల్రెడీ కట్ చేసిన సన్నివేశాల్ని కూడా బయటపెట్టాడు.
సినిమాలో తమన్నాకు సంబంధించి కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, ఓ సాంగ్ ను కట్ చేసినట్టు తెలిపిన రాజమౌళి, అదే టైమ్ లో అనుష్క చేసిన ‘కన్నా నిదురించరా’ పాటను కూడా కట్ చేసినట్టు వెల్లడించాడు.
అక్టోబర్ 31న ‘బాహుబలి-ఎపిక్’ను రిలీజ్ చేయబోతున్నారు. ప్రభాస్ కు పాన్ ఇండియా హీరో ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఇది. అంతేకాదు, తెలుగులో 2 భాగాల ట్రెండ్ ను తీసుకొచ్చింది కూడా ఈ సినిమానే.