నేహా శెట్టికి కలిసొచ్చింది ఏంటి?

TeluguCinema 18 Oct 2025
Neha Shetty

నేహా శెట్టి నటించిన రెండు సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి విడుదల అయ్యాయి. ఒకటి పెద్ద సినిమా, మరోటి ద్విభాషా చిత్రం. ఐతే, ఈ రెండు సినిమాల వల్ల ఆమెకి పారితోషికం తప్ప వేరే లాభం దక్కలేదు. పేరు కానీ, క్రేజ్ కానీ, జనం తన పాత్ర గురించి మాట్లాడుకోవడం కానీ జరగలేదు.

“ఓజీ” సినిమాలో ఆమె ఐటెం సాంగ్ చేసింది. కానీ విడుదల అయినప్పుడు ఆ పాటని సినిమాలో పెట్టలేదు. విడుదలైన వారం తర్వాత థియేటర్లో ఇరికించారు. కానీ ఆ పాటని ఎవరూ పట్టించుకోలేదు.

యూట్యూబ్ లో రిలీజ్ చేసిన తర్వాత కూడా దాని గురించి చర్చ లేదు. సాధారణంగా తమన్న వంటి హీరోయిన్లు చేసే ఐటెం సాంగ్స్ …సినిమాల కన్నా ఎక్కువ పాపులర్ అవుతాయి. సమంత చేసిన “పుష్ప” ఐటెం సాంగ్ కూడా ఇప్పటికీ పాపులర్. కానీ నేహా శెట్టికి ఆ పాట వల్ల కలిసొచ్చింది ఏమి లేదు.

ఇక తాజాగా ఆమె నటించిన …డ్యూడ్ విడుదలైంది. ట్రైలర్ విడుదలైనప్పుడు ఆమె పాత్ర కనిపించగానే అందరూ సర్ప్రైజ్ అయ్యారు. సినిమాలో దాదాపు కీలకమైన రెండో హీరోయిన్ గా కనిపిస్తుంది అని అందరూ భావించారు. కానీ ఆమె ఈ సినిమాలో అతిథిగా కనిపిస్తుంది. అదీ కూడా హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రియురాలిగా ఒక నిమిషం మాత్రమే దర్శనమిస్తుంది.

Neha Shetty

సినిమాలో మరో రెండు, మూడు సార్లు కనిపిస్తుంది కానీ కమెడియన్ సత్యకి భార్యగా అగుపిస్తుంది. అందుకే, నేహా శెట్టికి ఈ సినిమా వల్ల కూడా ఫాయిదా లేదు.