
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఈ రోజు 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 60లోకి పడడంతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఒకప్పుడు రొమాంటిక్ చిత్రాలకు పేరొందిన షారుక్ ఖాన్ ఇప్పుడు యాక్షన్ సినిమాలే చేస్తున్నారు.
ఇప్పటికే “పఠాన్”, “జవాన్” వంటి మాస్, యాక్షన్ సినిమాలతో భారీ విజయాలు అందుకున్న షారుక్ ఖాన్ ఇప్పుడు బాక్సాఫీస్ కింగ్ గా కొత్త అవతారంలో వస్తున్నాడు. ఈ కొత్త సినిమా పేరు… కింగ్. ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదలైంది.
సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమా “సరికొత్త షారుక్ ఖాన్ సినిమా అనుభవాన్ని” కలిగిస్తుందని సిద్ధార్థ్ ఆనంద్ అంటున్నారు. “వార్”, “పఠాన్” వంటి యాక్షన్ సినిమాలు తీసిన ఈ దర్శకుడు ఈ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నాడు.
ఇక షారుక్ ఖాన్ కూడా తెల్ల జుట్టుతో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో స్టయిలింగ్ ని తన వయసుకు తగ్గట్లు చేయించుకున్నారు షారుక్. ఆయన కూతురు సుహానా ఖాన్ కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ఇక షారుక్ సరసన మరోసారి దీపిక పదుకోన్ కనిపించనుంది.





