
హీరోయిన్ల పేర్లను తమ రాజకీయ విమర్శలకు వాడడం ఇటీవల తెలంగాణలో చూశాం. ఇప్పుడు తమిళనాడులో కూడా ఎక్కువైంది. మొన్నటి వరకు రాజకీయ పార్టీల నాయకుల విజయ్ ని టార్గెట్ చేస్తూ త్రిష పేరుని లాగారు. ఇప్పుడు తాజాగా ఏఐఏడీఎంకే నాయకుడు సి.వి. షణ్ముగం నయనతార (Nayanthara) పేరుని వాడుతున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ని విమర్శించేందుకు ఆయన నయనతార పేరుని లాగడంతో అక్కడ పెద్ద రగడ మొదలైంది.
ఆ నాయకుడు చేసిన కామెంట్లు ఇవి: “అబ్దుల్ కలాం మనల్ని కలలు కనమని అడిగారు. స్టాలిన్ అయితే మన కలలను పంచుకోమని కూడా చెప్పారు. నేను నయనతార కావాలని అడిగితే, స్టాలిన్ నా కలను నెరవేరుస్తారా? ఎవరైనా నయనతారతో తమ పెళ్లి కుదిర్చమని ఆయన్ని అడిగితే, ఆ కలను ఆయన నెరవేరుస్తారా?”
నయనతార తమిళనాట లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ పొందింది. ఆమెకి అక్కడ ఉన్న పాపులారిటీ మాములు కాదు. కానీ ఆమెకి ఇప్పటికే పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు. అలాంటి నటిని పెళ్లి చేసుకోవాలని ఉంది అని ఈ నాయకుడు అనడం ఏంటి, రాజకీయాల కోసం ఎవరి పేరునైనా లాగుతారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి.
