
ఇటీవల బాగా విమర్శలు పాలు అయిన పాట…సర్కే చునారి (Sarke Chunar Teri Sarke) అనే హిందీ పాట. నిజానికి ఇది హిందీ సినిమా పాట కాదు. కన్నడంలో రూపొందిన “కేడీ” (KD) అనే సినిమాలోని ఐటెం సాంగ్ కి హిందీ అనువాదం. సినిమా కన్నడ… కానీ హిందీ డబ్బింగ్ లో వచ్చిన పాటతో అసలు వివాదం మొదలైంది.
కేంద్ర ప్రభుత్వం సీరియస్ కావడంతో నిర్మాతలు ఆ పాటని హిందీలో తొలగించారు. ఇప్పుడు లిరిక్స్ మార్చి మళ్ళీ కొత్త పాట యాడ్ చెయ్యనున్నారు. ఈ పాటలో నోరా ఫతేహి డ్యాన్స్ చేసింది.
తాజాగా ఈ హిందీ పాట రాసిన రచయిత రకీబు ఆలం (Raqueeb Alam) స్పందించారు.
“ఈ పాట కన్నడ లిరిక్స్ నాకు ఇచ్చి అదే అర్థంలో హిందీలో రాయమని చెప్పారు. ఆ కన్నడ పాట, దాని అర్థం వినగానే ఇది తప్పు అని చెప్పాను. అలాగే రాస్తే జనం విమర్శిస్తారు అని చెప్పాను. సెన్సార్ కూడా ఒప్పుకోదు అని దర్శక, నిర్మాతలకు తెలిపాను. కానీ అన్ని భాషల్లో ఒకే తీరుగా ఉండాలి అని కన్నడ వెర్షన్ కి ట్రాన్స్ లేట్ లా ఉండాలి అని అన్నారు. నేను కేవలం ఆ కన్నడకి అనువాదంలా హిందీలో రాశాను తప్ప నేను ఇది ఒరిజినల్ గా రాసింది కాదు. అది బూతు అని చెప్పాను. కేవలం చివర్లో ఈ మాటలన్నీ ఒక మందు బాటిల్ కోసం అని రాస్తే సరిపోతుందా అనే డౌట్ నేను ముందే అడిగాను,” అని రచయిత అంటున్నారు.
ఇదే రచయిత త్వరలో విడుదల కానున్న “పెద్ది” సినిమా హిందీ వెర్షన్ పాటలు కూడా రాశారట. అలాగే పుష్ప సినిమా పాటలు రాశారు.
