
దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) తీసిన “యుఫొరియా” (Euphoria) చిత్రానికి మంచి ప్రశంసలు వచ్చాయి. కానీ సినిమా మాత్రం ఆడలేదు. సారా అర్జున్, భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి మొదటివారంలో విడుదలైంది. సమాజంలో పెరుగుతున్న డ్రగ్ కల్చర్ నేపథ్యంతో తెరకెక్కింది. అయితే ప్రేక్షకులు ఈ సినిమాని థియేటర్లలో పట్టించుకోలేదు.
తాజాగా ఈ సినిమా ఈటీవి విన్ లో స్ట్రీమ్ కి సిద్ధం అయిన నేపథ్యంలో మీడియాతో ముచ్చటించారు గుణశేఖర్.
“ఫిబ్రవరి ప్రారంభంలో అందరికీ జీతాలు వచ్చే సమయం కావడంతో మంచి రిలీజ్ డేట్ అనుకుని “యుఫోరియా”ను విడుదల చేశాను. కానీ ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు. సంక్రాంతి సమయంలో పెద్ద సినిమాలు చూసేసరికి, “యుఫోరియా”లాంటి చిన్న చిత్రాలను పట్టించుకోలేదనిపించింది. టైటిల్ కూడా సినిమాకు మైనస్ అయింది. మేము ఈ సినిమాను థియేటర్ ఆడియెన్స్ కోసం ఎంతో ఖర్చు పెట్టి తీశాం. కానీ ప్రేక్షకులు మాత్రం ఇది ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అడిగారు. రిలీజ్ సమయంలో తెలుగులో ఇలాంటి సినిమా వచ్చిందా అని చాలామంది ఆశ్చర్యపోయారు,” అని అన్నారు గుణశేఖర్.
“భూమిక”కి లండన్‌లో ఉన్నప్పుడు ఈ కథ చెప్పాను. ఈ పాత్రను నమ్మితే మీకు అవార్డు వస్తుందని అప్పుడే చెప్పాను. నేను చెప్పినట్లుగానే ఆమెకు ఉత్తమ సహాయ నటిగా గద్దర్ అవార్డు వచ్చింది. నాకు ఉత్తమ కథా రచయితగా అవార్డు దక్కింది. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలను కనీసం మూడు నెలల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదని నేను భావిస్తున్నాను. అలా చేస్తేనే థియేటర్లు నిలబడతాయి,” గుణశేఖర్ తెలిపారు.
“మహేష్ బాబును ‘యుఫోరియా’ చూడమని నేను అడగలేదు. ఆయన స్వయంగా చూసి ట్వీట్ చేశారు. నేను సక్సెస్ మీట్‌కు ఆహ్వానిస్తే తప్పకుండా వచ్చేవారు కూడా. ‘యుఫోరియా’ను ‘ధురంధర్’ స్థాయి హిట్ అవుతుందనే నమ్మకంతో తీశాను. ఎందుకంటే ఇది నేషనల్ సబ్జెక్ట్ కాదు, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్” అని అన్నారు.
