
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో ఈ సినిమాకు డిసెంబర్ 2026 విడుదల తేదీ కనిపించడంతో సినిమా వాయిదా పడిందన్న ప్రచారం జోరందుకుంది.
బుక్‌మైషోలో విడుదల తేదీ మారిపోవడంతో పాటు చిత్రబృందం నుంచి కొత్త అప్డేట్లు లేకపోవడం, ఇప్పటివరకు ఒక్క పాట మాత్రమే విడుదల చేయడం వల్ల అభిమానుల్లో గందరగోళం నెలకొంది. దీంతో ఆగస్టు విడుదల సాధ్యం కాదనే ప్రచారం కూడా జరిగింది. పైగా ఆగస్టు 26న యష్ నటించిన “టాక్సిక్” విడుదల కాబోతోంది. అంటే ‘ఇరుముడి’కి థియేటర్ల కొరత పడుతుంది.
అయితే, ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల తేదీలో మార్పు లేదు. ఆగస్టు 21, 2026న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ తన కెరీర్‌లో భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈసారి తండ్రి-కూతురు అనుబంధం, భక్తి నేపథ్యంతో సాగే భావోద్వేగభరితమైన కథలో నటిస్తున్నారు. అయితే, ఇప్పటికే షూటింగ్ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
‘ఇరుముడి’లో రవితేజ కుమార్తె పాత్రలో నక్షత్ర నటిస్తుండగా, కథానాయికగా ప్రియా భవానీ శంకర్ కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
