
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ దేవాలయంలో అమ్మవార్ల ఆశీస్సులు తీసుకుని చిత్రబృందం ప్రచార యాత్రను ప్రారంభించింది.
ఈ చిత్రం ఆగస్టు 14, 2026న విడుదల కానుంది.
ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ ఆలయాన్ని సందర్శించిన చిత్రబృందం సంప్రదాయబద్ధంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించింది. ఈ సందర్భంగా కథానాయిక కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) ప్రత్యేకంగా బోనాల సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవార్లకు బోనం సమర్పించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.
దర్శకుడు ఎం.ఎస్. రాజు, నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు, సమర్పకుడు అజయ్ కెఆర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్.వి.ఎన్. సుబ్బరాజు, హీరో శ్రవణ్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దర్శకుడు ఎం.ఎస్. రాజు ఇలా అన్నారు: “అమ్మవారి అంశాలతో ముడిపడిన కథాంశంతో ‘అగధ’ రూపొందింది. అలాంటి సినిమాకు బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా ‘అగధ’ను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.”
