
రవితేజ నటించిన “ఇరుముడి” (Irumudi) చిత్రం వాయిదా పడనుంది అని ఇటీవల రూమర్లు వచ్చాయి. కానీ ఈ సినిమా ఆగస్టు 21 నుంచి వాయిదా పడకపోవచ్చు అని ఇటీవలే తెలుగుసినిమా.కామ్ రాసింది. అది ఇప్పుడు నిజమైంది.
ఈ రోజు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) కొత్త పోస్టర్ విడుదల చేసింది. రవితేజ కింద కూర్చున్న కార్డ్స్ ఆడుతుంటే అతని కూతురు వెనకాల నుంచి వాతెసుకున్న పోస్టర్ రిలీజ్ చేస్తూ విడుదల తేదీ ఆగస్ట్ 21 అని మరోసారి ప్రకటించింది ఈ నిర్మాణ సంస్థ. అలా ఈ సినిమా విడుదల వాయిదా అనే పుకార్లకు తెరపడింది.
ఈ చిత్రంలో రవితేజ తన కెరీర్‌లోనే అత్యంత ఎమోషనల్ తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ప్రియ భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర వారి కుమార్తె పాత్రను పోషిస్తోంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలవనుంది.
దర్శకుడు శివ నిర్వాణ ఇప్పటివరకు రొమాన్స్ చిత్రాలు తీశారు. ఇప్పుడు మొదటిసారిగా తండ్రి-కూతుళ్ళ ఎమోషన్ తో ఒక యాక్షన్ డ్రామాని తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది.
