
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో, హీరోయిన్లుగా రాజమౌళి తీస్తున్న “వారణాసి” (Varanasi) చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జోరుగా సాగుతోంది. తాజాగా ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ తో కలిసి హైదరాబాద్ విచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. సెప్టెంబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత నుంచి నా పని మొదలవుతుంది అని అంటున్నారు సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి (MM Keeravani).
ప్రస్తుతం కీరవాణి అమెరికాలో ఉన్నారు. అక్కడ పలు నగరాల్లో మ్యూజికల్ కాన్సర్ట్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఒక కాన్సర్ట్ లో “వారణాసి” సినిమా గురించి మాట్లాడారు.
“సెప్టెంబర్ నుంచి నేపథ్య సంగీతం మొదలు పెడతాను. ఐదు నెలల పాటు వారణాసి సినిమాకే అంకితం అవ్వబోతున్నా,” అని కీరవాణి తెలిపారు.
తన మొదటి సినిమా “స్టూడెంట్ నెంబర్ వన్” చిత్రం నుంచి రాజమౌళి తన అన్నయ్య (కజిన్) కీరవాణితోనే పనిచేస్తున్నారు. ఆయన సంగీతం రాజమౌళి సినిమాలకు బలంగా ఉంటూ వస్తోంది. రాజమౌళి తీసిన “ఆర్ ఆర్ ఆర్” చిత్రానికి ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది.
“వారణాసి” చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రిభినయం చేస్తున్నారు. సాధారణ నేటి కాలం యువకుడి పాత్ర పోషిస్తున్న మహేష్ బాబు సినిమాలో ఒక కీలకమైన ఎపిసోడ్ లో శ్రీరాముడిగానూ కనిపిస్తారు. రామాయణ ఘట్టానికి సంబంధించిన సంగీతం కీరవాణికి పెద్ద ఛాలెంజ్ అందుకే ఈ సినిమాకి 5 నెలలు డేడికేటెడ్ గా పనిచేస్తారట.
