
రాజేంద్ర ప్రసాద్ కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. ఈ అవార్డు రావడం తనని ఆశ్చర్యానికి గురి చేసింది అంటున్నారు రాజేంద్రుడు.
“నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈ రోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది అని తెలిసినప్పటినుండి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఒక నటుడిని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను,” అని అన్నారు రాజేంద్ర ప్రసాద్.
“నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ నిజం చెప్పాలంటే అవార్డు నాది కాదు, మీది. 48 ఏళ్లుగా నన్ను ఒక నటుడి గానే కాకుండా, మీ ఇంట్లో ఒక మనిషిగా, మీలో ఒకటిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నేను నవ్వించిన, ఏడిపించిన, మా రాజేంద్రప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం. ఆ ప్రేమే ఈరోజు నన్ను ఇక్కడ వరకు నడిపించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నన్ను సొంత బిడ్డ లాగా ఆదరించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను,” అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
“మీ ఆశీస్సులు ఎప్పుడూ నామీద ఇలాగే ఉండాలి.. బ్రతికున్నంత వరకు,” అని అన్నారు రాజేంద్రప్రసాద్.
