
రామ్ చరణ్ నటిస్తోన్న “పెద్ది” (Peddi) ఇప్పటికే మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఐతే ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ కానుంది అని ప్రచారం జరుగుతోంది. కొత్త డేట్ ఎప్పుడో ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
కిరణ్ అబ్బవరం హీరోగా “చెన్నై లవ్ స్టోరీ” పేరుతో ఒక ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు SKN. ఈ సినిమా పాట విడుదలైంది. ఈ సందర్భంగా తన సినిమా విడుదల గురించి మాట్లాడుతూ “పెద్ది” కొత్త డేట్ ని బయట పెట్టారు.
“మేం జూన్ 26న చెన్నై లవ్ స్టోరీని విడుదల చేద్దామని అనుకున్నాం. కానీ మా సాయి రాజేష్ ఇప్పుడే “పెద్ది” జూన్ 25న వస్తోంది అని చెప్పారు. మెగా పవర్ స్టార్ సినిమా వస్తోంది కాబట్టి మేం వేరే డేట్ ఫిక్స్ చేసి చెప్తాం,” అని SKN అన్నారు.
అలా “పెద్ది” మేకర్స్ కొత్త డేట్ అధికారికంగా ప్రకటించకముందే ఆ వార్త ఇలా బయటికి వచ్చింది. ఐతే ఆ తర్వాత ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. పెద్ద సినిమాలు డేట్ ప్రకటించేంత వరకు మన డేట్ చెప్పొద్దు అని సాయి రాజేష్ నాకు చెప్పిన దాని సరిగా అర్థం చేసుకోక, మిస్ కమ్యూనికేషన్ వల్ల అలా చెప్పాను అని వివరణ ఇచ్చారు.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా దర్శకుడు బుచ్చిబాబు తీస్తున్న “పెద్ది” చిత్రం షూటింగ్ ఇంకా చాలా మిగిలి ఉంది. మరో రెండు పాటలు తీయాలి. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చెయ్యాలి. అందుకే ఈ జాప్యం.
