‘ఆదిపురుష్’ బీజీపీ వాళ్ళ కోసమేనా?

ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. 2023లోనే అయోధ్యలో రామమందిరం ప్రారంభం కానుంది. ఈ రెండింటికి లింక్ ఉందని అంటున్నారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు.
బీజేపీ ఎన్నికల ప్రచారం కోసం సినిమాలను కూడా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. “గత లోక్ సభ ఎన్నికలకు ముందు… యూరి ది సర్జికల్ స్ట్రైక్ అనే సినిమాని తమ ప్రాపగాండా కోసం వాడింది బీజేపీ. రీసెంట్ గా ‘కాశ్మీర్ ఫైల్స్’ కూడా అదే బాపతు. నాకు తెలిసి ‘ఆదిపురుష్’ సినిమాని కూడా ఎన్నికల ప్రచారంలో వాడుతారు,” అని కేటీఆర్ తెలిపారు.
బీజేపీపై అయన వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ అభివృద్ధి మాట వదిలేసి ‘మతం’, ‘దేవుడు’ వంటి ఎమోషనల్ విషయాలను ప్రచారం చేస్తూ ఎలా రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందో ఆయన వివరించారు. అందులో భాగమే ‘ఆదిపురుష్’ వంటి చిత్రాలు అనేది కేటీఆర్ అభిప్రాయం.
ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు ‘ఆదిపురుష్’లో. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి నిర్మాత టీ. సిరీస్ అధినేత భూషణ్ కుమార్. షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.