
నటి సుమ తన భర్త రాజీవ్ కనకాల నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది అని రెండు, మూడేళ్ళ క్రితం చాలా ప్రచారం జరిగింది. ఐతే, వాళ్లిద్దరూ కలిసిపోయి మళ్లీ భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నారు.
“గొడవలు జరిగిన మాట నిజమే. అందులో అబద్దం లేదు. కానీ, విడిపోలేదు. భార్యాభర్తలుగా విడిపోవడం సులువే కావొచ్చు కానీ తల్లితండ్రులుగా కష్టం,” అని సుమ తాజాగా చెప్పారు. తమ మధ్య గొడవలు జరిగినట్లుగా వచ్చిన ప్రచారం అబద్దం ఏమీ కాదని ఆమె క్లారిటీ ఇచ్చారు.
సుమ ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రొమోషన్ లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రతి సినిమా విడుదల సమయంలో ఆమె సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చెయ్యడం సర్వసాధారణం. తన సినిమా కోసం ఆమె హాట్ సీట్ లో కూర్చున్నారు.
సుమ, రాజీవ్ కనకాల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, సుమమ్మ ఇంట్లో ఎన్ని పంచాయితీలు జరిగి చివరికి సుఖాంతం అయింది. ఆమె ఇప్పుడు తన కొడుకుని హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. రాజీవ్ కూడా ఆమెకి అండగా ఉన్నారట.