ఈ వీకెండ్ బాగా ఆడాలి

‘మిరాయి’ సినిమా మొదటి వారం పూర్తి చేసుకొంది. మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లపైనే వసూళ్లు అందుకొంది. తేజ సజ్జాలాంటి యువ హీరోకి మొదటి వారంలోనే 100 కోట్ల వసూళ్లు అంటే మాటలు కాదు. ఐతే, ఇది చాలదు.
ఈ సినిమాకి మరో రెండు, మూడు వారాలు ఆడే పరిస్థితి లేదు. ఎందుకంటే, సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ నటించిన “ఓజి” విడుదల అవుతుంది. అంటే ఆ సినిమా వచ్చిందంటే ఈ సినిమాకి థియేటర్లు మొత్తం తగ్గిపోతాయి. కలెక్షన్లు రాబట్టుకోవడం కూడా కష్టం.
ఈ సినిమాకి ఇంకా ఎక్కువ వసూళ్లు రావాలంటే ఈ మూడు రోజుల సమయమే ఉంది. ఈ వీకెండ్ ఎంత బాగా రాబట్టుకుంటే అంత మంచిది. ఆ తర్వాత వచ్చేది అంతా బోనస్ గా చూడాలి.
“మిరాయి” సినిమా ఒక దశలో రెండు వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది అని ట్రేడ్ విశ్లేషకులు భావించారు. కానీ, హిందీలో పెద్దగా రాకపోవడం, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఫ్లాప్ కావడంతో పూర్తి వసూళ్ల భారం తెలుగు వెర్షన్ పైనే పడింది. అందుకే, ఇప్పుడు ఈ వీకెండ్ వసూళ్లు ముఖ్యం.