పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా?

పవన్ కళ్యాణ్ ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేశారు. అలాగే “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేశారు. అంటే మొత్తంగా మూడు సినిమాల షూటింగులు ఈ ఏడాది కంప్లీట్ చేసి ఫ్యాన్స్ ని ఆనందపరిచారు. “ఉస్తాద్ భగత్ సింగ్” వచ్చే ఏడాది విడుదల అవుతుంది.
ఈ మూడు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పట్లో మరో సినిమా ఒప్పుకోరు అని అందరూ భావించారు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఆయన పూర్తిగా తన బాధ్యతలు నిర్వర్తించేందుకు సినిమాలకు కొన్నాళ్ళూ దూరంగా ఉంటారని అంచనా వేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం మరో కొత్త సినిమాకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది.
“హరి హర వీర మల్లు”, “బ్రో”, “ఓజి”, “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాలతో పాటే పవన్ కళ్యాణ్ దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమా ఒప్పుకున్నారు. కానీ దాన్ని ఆయన మొదలు పెట్టలేదు. పూజ కార్యక్రమాలు కూడా చెయ్యలేదు. దాంతో ఈ సినిమా ఉండకపోవచ్చు అని అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు ఆ సినిమాని కూడా పూర్తి చెయ్యాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట.
ఈ సినిమాకి నిర్మాత రామ్ తాళ్లూరి. ఆయన పవన్ కళ్యాణ్ తో చాలా కాలంగా స్నేహం కొనసాగిస్తున్నారు. జనసేన పార్టీకి ఆర్థికంగా, ఇతరత్రా సాయం చేస్తున్నారు. దాంతో ఇటీవలే రామ్ తాళ్లూరి తమ పార్టీలో ఒక పదవి ఇచ్చారు. పదవితో పాటు సినిమా కూడా పూర్తి చేసి రామ్ తాళ్లూరికి తాను చేసిన ప్రామిస్ నిలబెట్టుకోవాలని భావిస్తున్నారట.
అందుకని, దర్శకుడు సురేందర్ రెడ్డి కొత్త సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుంది అని టాక్.