
గతేడాది సంక్రాంతికి విడుదలైన చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ ఇరగదీసింది. అంత పెద్ద హిట్ దక్కినా ఆమెకి పెద్దగా ఆఫర్లు రాలేదు. గ్లామర్ గాళ్ కాకపోవడమే కారణం.
సరిగ్గా ఏడాది తర్వాత ఆమె నటిస్తున్న కొత్త చిత్రం మొదటి లుక్ విడుదలైంది. పోయిన సంక్రాంతికి భారీ హిట్ సినిమా వస్తే ఈ సంక్రాంతికి మరో సినిమా మొదటి లుక్ విడుదలైంది. ఈ ఏడాది గ్యాప్ లో ఆమె చేస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమా పేరు “ఓ..! సుకుమారి.”
ఇటీవల కొన్ని విజయాలు చూసిన యువ హీరో తిరువీర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. “గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో” సినిమా హిట్ తర్వాత తిరువీర్, “సంక్రాంతికి వస్తున్నాం” తర్వాత ఐశ్వర్య రాజేష్ చేస్తున్న సినిమా ఇది.
నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఈ రోజు ఐశ్వర్య రాజేష్ పుట్టినరోజు సందర్భంగా, ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆమె ఇందులో దామిని అనే పాత్ర పోషిస్తున్నారు.
