
ప్రతి సినిమా షూటింగ్ కి ముందు ఒక వీడియోని విడుదల చెయ్యడం దర్శకుడు లోకేష్ కనగరాజ్ పద్దతి. విక్రమ్, లియో, జైలర్, కూలీ, ఇలా అన్ని సినిమాలకు ప్రత్యేకంగా వీడియో షూట్ చేసి తన సినిమాలను ప్రకటించాడు. ఆ తర్వాతే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడుతాడు.
ఈ వీడియోల్లో ఉన్నది సినిమాల్లో అస్సలు ఉండదు. అనిరుధ్ తో ఇంగ్లీష్ లో పాట పాడించి పెట్టడం కూడా అతని పద్దతి. ఇప్పుడు అదే స్టయిల్ ని అదే పద్దతిలో కాపీ కొట్టాడు దర్శకుడు సుజీత్. ఇతను ఇంతకుముందు ప్రభాస్ తో తీసిన “సాహో”కి కూడా ప్రత్యేకమైన వీడియో ప్రోమో చేసి వదిలాడు. ఆ లెక్కన లోకేష్ కన్నా ముందే స్టార్ట్ చేసినట్లు. కానీ తాజాగా నానితో తీస్తున్న సినిమాకి విడుదల చేసిన వీడియో మాత్రం అచ్ఛంగా లోకేష్ స్టయిల్ ని కాపీ కొట్టినట్లు కనిపిస్తోంది.
ఈ సినిమాకి బ్లడీ రోమియో (Bloody Romeo) అనే పేరుని ఖరారు చేశారు. నాని ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. కాకపోతే బయటికి చెఫ్ గా కనిపిస్తూ ఉండే పాత్ర. “బాషా” సినిమా నుంచి ఇదే పద్దతి కదా. లోకేష్ కూడా తన సినిమాల్లో ఇదే పద్దతిని “లియో” సినిమాలో చేశాడు.
కాకపోతే ఇది సీరియస్ సినిమా కాదంట. కామెడీగా సాగుతుందట.
