
మాజీ హీరోయిన్ సమీరా రెడ్డి (Sameera Reddy)కి ఉన్నట్టుండి సౌత్ సినిమాపై మమకారం పొంగిపొర్లింది. దక్షిణాది చిత్ర పరిశ్రమను ఆమె ఆకాశానికెత్తేస్తోంది. ఇదంతా ఎందుకంటే, ఆమె నటిగా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ‘ఆఖరి సవాల్’ అనే సినిమా చేస్తోంది.
పనిలో పనిగా సౌత్ లో కూడా అడుగుపెట్టే ఉద్దేశంతో, ఆమె సౌత్ ను పొగిడేస్తోంది. గతంలో బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వస్తున్న టైమ్ లో సౌత్ సినిమాల్లోకి వచ్చిందట సమీరా. అప్పట్లో బాలీవుడ్ లో అవకాశాలు రాని హీరోయిన్లు మాత్రమే సౌత్ లో సినిమాలు చేసేవాళ్లని, తను మాత్రం హిందీలో క్రేజ్ ఉన్నప్పటికీ, సౌత్ పై మమకారంతో సినిమాలు చేశానని చెప్పుకొచ్చింది.
సౌత్ లో చిరంజీవి, ఎన్టీఆర్, సూర్య, అజిత్, మోహన్ లాల్ లాంటి దిగ్గజాలతో పని చేయడం తన అదృష్టంగా చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి. కెరీర్ లో వెనక్కు తిరిగి చూసుకుంటే, వాళ్లతో చేసిన సినిమాలే తనకు మధుర జ్ఞాపకాలు అంటోంది.
ఒకప్పుడు బాలీవుడ్ లో అవకాశాల్లేకపోతే సౌత్ కు వచ్చేవారని, కానీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లంతా సౌత్ వైపు క్యూ కడుతున్నారని అంటోంది. సౌత్ సినిమాపై తనకు ముందు నుంచి చాలా మంచి అభిప్రాయం ఉందని, తన నమ్మకం ఇప్పుడు నిజమైందని చెబుతోంది సమీరా.
