
తెలంగాణాలో ఒక పద్దతి, ఒక పాలసీ లేకుండా టికెట్ రేట్లు పెంపు సాగుతోంది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోల సందర్భంగా తొక్కిసలాట జరగడం, ఒక మహిళ చనిపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకపై తెలంగాలో ప్రీమియర్ షోలు ఉండవు అని ప్రకటించారు. అలాగే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇకపై టికెట్ రేట్లు పెంచబోము అని తెలిపారు. పది రోజులకే ఇద్దరూ మాట తప్పి సినిమా టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చారు, ప్రీమియర్ షోలకు గేట్లు తెరిచారు.
ఈ ఏడాది గ్యాప్ లో అనేక సినిమాలకు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే ఇకపై అలా ఉండదు, మా దగ్గరికి నిర్మాతలు రావొద్దు అని పలుమార్లు ప్రకటించింది ప్రభుత్వం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లబ్ది కోసం టికెట్ రేట్ల పెంపులో కొంత ఆదాయాన్ని సినీ కార్మికుల సంక్షేమం ప్రత్యక అకౌంట్లో వెయ్యిస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోర్టు టికెట్ రేట్ల పెంపు విషయంలో చీవాట్లు పెట్టినా “అఖండ 2” సినిమాకి అనుమతి ఇచ్చి ప్రత్యేక అకౌంట్ లో డబ్బు పెట్టే జీవో ఇచ్చారు.
తర్వాత కోర్టు తప్పు పట్టింది అని “అఖండ 2” తర్వాత ఇకపైనా టికెట్ రేట్లు పెంచేది లేదని కోమటిరెడ్డి ప్రకటించారు. అందుకే, “ది రాజా సాబ్”కి జనవరి 8వ తేదీ రాత్రి 11 వరకు ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వకుండా, జీవో ఇవ్వకుండా ఆపారు. చివరికి టికెట్ రేట్ల పెంపుకి అనుమతి ఇస్తూ రాజా సాబ్ కి కొత్త జీవో ఇచ్చారు. తెల్లారి కోర్టు మళ్ళీ చీవాట్లు పెట్టింది.
అయినా, తాజాగా “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రానికి విడుదలకు రెండు రోజుల ముందే ప్రీమియర్ షోలకు అనుమతి ఇస్తూ, టికెట్ రేట్లు పెంచుతూ తాజగా ప్రభుత్వం జీవో ఇచ్చింది.
ఈ రెండేళ్లల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సినిమాల టికెట్ రేట్ల విషయంలో చిత్తం వచ్చినట్లుగా మాట్లాడింది. జీవోలు ఇచ్చింది. ఒక పాలసీ లేకుండా సాగుతోంది వ్యవహారం. “రాజాసాబ్”కి అర్ధరాత్రి వరకు జీవో ఇవ్వకుండా తాత్సరం చేసి, చిరంజీవి సినిమాకి రెండు రోజుల ముందే జీవో విడుదల చెయ్యడం కొందరికి ఆశ్చర్యం కలిగించింది. కానీ ఈ ప్రభుత్వ వైఖరి అలా సాగుతోంది.
